దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు మార్గం: కేటీఆర్

దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్‌. అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలును ప్రారంభించిన తర్వాత గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అతి పెద్ద ప్రాజెక్టును చేపట్టామన్నారు. ప్రాజెక్టుపై ఎల్‌అండ్‌టీ రూ.12వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే భూసేకరణ చేశామన్నారు.

అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ కు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ కల్పించామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో రైలుకు చాలా అవార్డులు వచ్చాయన్నారు. దేశంలోనే హైదరాబాద్ ది బెస్ట్ అని… హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉందన్నారు. ఐజీబీఎస్‌ సంస్థ హైదరాబాద్‌ మెట్రోకు ప్లాటినం అవార్డును అందజేసిందన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు కేటీఆర్.

అంతకు ముందు అమీర్‌పేట నుంచి ప్రారంభమైన మెట్రో రైలు ఎల్బీనగర్‌ చేరుకోగానే… స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు గవర్నర్ తో పాటు మంత్రులు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను  పరిశీలించారు. తర్వాత ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates