దేశానికి మార్గదర్శి..మహాత్ముడు


ప్రపంచంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వ్యక్తి జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన జీవితకాలంలో ఏ పదవిని అధిష్టించలేదు. ఏ రూపంలోనూ ఆస్తికూడబెట్టలేదు. ఆయనకు ఏ విధమైన అధికారిక హోదా లేదు. కానీ ప్రజలు, ప్రభుత్వాలు, భవిష్యత్‌ తరాలు, మేధావులతో పాటు ప్రపంచ పాలకుల్ని ప్రభావితం చేశారు. రవిఅస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యంపై అహింసాయుత పోరాటం చేశారు. భారతావనికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తీసుకొచ్చారు.

గుజరాత్‌లోని పోరుబంద్‌లో 1859అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జన్మించారు. ఆయన పుట్టింది వైశ్యకులంలో. చదివింది న్యాయవిద్య. ఆ రోజుల్లోనే లండన్‌వెళ్ళి బారిస్టర్‌ ఇన్‌ లా చదవగలిగే ఆర్ధిక శ్రీమంతుడాయన. ఒక కేసు వాదన కోసం దక్షిణాఫ్రికాకెళ్ళిన మహాత్ముడికి జాతివివక్ష ఎదురుకావడంతో ఆయనక్కడే తన నిరసన వ్యక్తంచేశారు. అప్పటికి దక్షిణాఫ్రికాలోని బ్రిటీష్‌ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఉల్లంఘించారు. బానిసత్వం ఎంత దారుణంగా ఉంటుందో.. పరాయి పాలన క్రింద స్వదేశీయులు ఎన్ని అగచాట్లకు గురౌతున్నారో.. పరపాలన ఎంతటి హీనంగా ఉంటుందో అప్పుడే ఆయనకు తెలిసింది. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చీరాగానే స్వాతంత్రోద్యమంలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా కాంగ్రెస్‌ నాయకుడిగా ఎదిగారు. అప్పటికే కొన్ని దశాబ్ధాలుగా భారత స్వాతంత్ర సంగ్రామం సాగుతోంది. 1857లోనే దీనికి బీజం పడింది. తొలి సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటీషీయులు తమ బలాన్ని బలగాల్ని ఉద్యమకారులపై ప్రయోగించారు. తిరుగుబాటును నిర్దాక్షిణ్యం గా అణచేశారు. ఈ క్రమంలో హింసాయుత ఆందోళన వలన ప్రయోజనం లేదని మహాత్ముడు గుర్తించారు. అహింసాయుతంగా సహాయ నిరాకరణ చేపట్టడం ద్వారా విదేశీ పాలకుల్ని దేశం నుంచి తరిమికొట్టాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా కాంగ్రెస్‌ను తీర్చిదిద్దారు. ఈ క్రమంలో గాంధీ కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయితే మెజార్టీ వర్గం ఆయన విధానాన్ని విశ్వసించింది. దీంతో కాంగ్రెస్‌లో గాంధీ బలమైన తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అంతకుముందు ఎందరో నాయకులు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినా మహాత్ముడి రాకతో ఉద్యమం రూపురేఖలు మారిపోయాయి. ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. బ్రిటీష్‌ సామ్రాజ్యపు బానిసత్వంలో ఉన్న మిగిలిన దేశాలు కూడా ఉద్యమం విస్తరించింది. పాలకుల పునాదులు కదిలిపోయే పరిస్థితి కొనితెచ్చింది.

దక్షిణాఫ్రికా నుంచి ఉద్యమ నేతగా భారత్‌లోకి అడుగు పెట్టిన రోజునుంచి ఉద్యమానికి పిలుపునిచ్చిన ప్రతిరోజు చరిత్రలో ఓ ప్రత్యేకత సంతరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రత్యేక రోజును పండుగ వాతావరణంలో భారతీయులు జరుపుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలో అన్నివర్గాల్ని ప్రభావితం చేయగలిగిన ఒకే వ్యక్తి మహాత్మాగాంధీ. 20వ శతాబ్ధాన్ని శాసించగలిగింది ఆయనే.

ఆయన ధరించిన కొల్లాయి నుంచి చెప్పులు, కళ్ళజోడు కూడా ప్రజల్ని విశేషంగా ఆకట్టుకునేవి. ఇంత నిరాడబంరంగా బతికిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే శక్తివంతమైన బ్రిటీష్‌ సామ్రాజ్య పునాదులు కూల్చివేసి భవిష్యత్‌ తరాలకు కూడా మార్గదర్శం అయ్యారు. ఆయనపై బ్రిటీషీయులే బయోపిక్‌ తీశారు. 1982లో విడుదలైన ఈ సినిమా కూడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఏడాది 8అకాడమీ అవార్డుల్ని గాంధీ బయోపిక్‌ గెల్చుకుంది. ఆనాడే భారత్‌లో ఈ చిత్రం వందకోట్ల వసూళ్ళు సాధించింది.

గాంధీజీ జయంతి సందర్భంగా  ఇవాళ్టి నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates