దేశానికే ఆదర్శం : ఈ సిద్ధిపేట హైస్కూల్ మరో శాంతినికేతన్

ZPక్రమశిక్షణకు,  నాణ్యమైన విద్యకు  మారుపేరుగా నిలుస్తూ సర్కార్ స్కూళ్లపై నమ్మకం కలిగిస్తోంది  సిద్దిపేటలోని ఇందిరానగర్  జిల్లా  పరిషత్  హైస్కూల్. పాఠశాల విద్యా  ప్రమాణాల్లో  జాతీయస్థాయిలో  అవార్డులను  సొంతం చేసుకున్న  ఈ స్కూల్.. రాష్ట్రంలోని  మిగతా సర్కార్  స్కూళ్లకు  ఆదర్శంగా నిలుస్తోంది.  ఈ స్కూల్  విద్యార్థులంతా.. చదువుతో పాటు  ఆటపాటల్లో  రాణిస్తూ ముందుకెళ్తున్నారు.  ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం పిల్లలు, తల్లిదండ్రులు క్యూకడుతున్నారు.

ఇందిరానగర్  హైస్కూల్లో ప్రస్తుతం 875 మంది విద్యార్థులు ఉన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో 16 సెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక్కో తరగతికి మూడు సెక్షన్లు ఉన్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఏడాది స్కూల్స్ రీఓపెన్ అయి రెండు రోజులకే అడ్మిషన్ పూర్తికావడంతో చాలా మంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. స్కూళ్లో విద్యార్ధులకు స్వేచ్ఛతో కూడిన చదువును నేర్పిస్తున్నారు. కార్పోరెట్ స్కూళ్లల్లో చదివే పిల్లలను ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తారు. ఇక్కడి టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటూనే పాఠాలు చెబుతారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతారు. విద్యార్థులకు ఇంటి దగ్గరున్న సమస్యలను తెలుసుకుంటూ టీచర్లే పెద్దదిక్కుగా ఉంటున్నారు. అందుకే పిల్లలు ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువు, ఆటపాటలతో పాటు అన్నింట్లో రాణిస్తున్నారు.

స్కూల్లో హెడ్ మాస్టర్ తో పాటు 20 మంది టీచర్లు, ముగ్గురు విద్యావాలంటీర్లు, మరో ముగ్గురు వృత్తి విద్యా కోర్సులు చెప్పే టీచర్లు ఉన్నారు. స్కూల్లో టీచింగ్ కూడా అంతా డిఫరెంట్ గా ఉంటుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఐదు టీంలు ఏర్పడి ఆటలు, డ్యాన్స్, మ్యూజిక్, సాంఘిక ఉన్నతి, చేతి వృత్తులు నేర్పిస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు స్కూల్ కు అరగంట ముందుగా వచ్చి ధ్యానం చేయడంతో డైలీ టైం టేబుల్ మొదలవుతుంది. అన్నీ సిస్టమేటిక్ గా జరగడంతో ప్రొఫెసర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాల అంటే సౌకర్యాలు సరిగా ఉండవనే భావన ప్రజల్లో ఉంది. కానీ ఈ స్కూల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశాలమైన తరగతి గదులు, తాగునీరు, ప్లేగ్రౌండ్ కూడా ఉంది. ఉన్నత ప్రమాణాలతో సాగుతున్న ఈ స్కూల్ ను నాట్కో సంస్థ గుర్తించి 60 లక్షలతో అన్ని వసతులు కల్పించింది. ఈ ఏడాది మరో 40 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బాలవికాస, లయన్స్ క్లబ్, ఇతర దాతలతోపాటు, స్కూల్ టీచర్లు కూడా విరాళాలు ఇస్తున్నారు. అందరి సహకారంతోనే స్కూల్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందంటున్నారు టీచర్లు.

స్కూల్లో అన్ని వసతులతో మంచి విద్యాబోధన అందిస్తుండటంతో తల్లిదండ్రులంతా ప్రైవేట్  స్కూళ్లల్లో చదివే తమ పిల్లలను ఇక్కడి చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్కూల్లో చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించడంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక స్కూల్లో టీచర్లంతా విద్యార్థులను సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటారు. ప్రతి టీచర్ ఓక్కో బాద్యత తీసుకొని పనిచేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు అభివృధ్ది చెందాలనే వాదనను సపోర్ట్ చేస్తూ కొంతమంది టీచర్ల తమ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు.

స్కూల్లో NCC, NGC కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రతినెలా విద్యార్ధులకు వ్యాసరచన, పేయింటింగ్స్ పోటీలు  నిర్వహిస్తారు. స్కూల్లో సైన్స్ ఫేయిర్, ఫైర్ సేఫ్టీ అవగాహన, సామాజిక చైతన్యం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మండల, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి విద్యార్ధుల టాలెంట్ ను వెలికితీస్తారు. స్కూల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సహకాలు ఇస్తూ అభినందిస్తుంటారు టీచర్లు.

స్కూల్ విద్యార్థులు సాధిస్తున్న అధ్బుత ఫలితాలను చూసి స్వచ్చంధ సంస్థలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. హెడ్ మాస్టరే ముందుగా సొంత డబ్బులతో స్కూల్లో మార్పులకు శ్రీకారం చుట్టాడు. మంత్రి హరీష్ రావు చొరవతో నాట్కో ట్రస్ట్ స్కూల్ కి సరిపడా భవవాలను నిర్మిస్తూ డిజిటల్ క్లాసులకు అవసరమైన పరికరాలను అందిస్తూ తోడ్పాటు అందిస్తోంది. గూగుల్ సంస్థ కూడా త్వరలో గూగుల్ ఫీచర్ క్లాస్ ని స్కూల్లో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని జిల్లా పరిషల్ హైస్కూళ్లల్లో మొదటి గూగుల్ ఫీచర్ క్లాస్ ఉన్న స్కూల్ గా ఇందిరానగర్ పాఠశాల రికార్డులకెక్కనుంది.

 

Posted in Uncategorized

Latest Updates