దేశాలు దాటి.. నిజామాబాద్ వచ్చింది : కారు డ్రైవర్ ప్రేమలో విదేశీ యువతి

SOUDI LOVE INDIAఓ విదేశీ యువతీ ప్రేమ కోసం ఎల్లలు దాటింది. ప్రేమించిన ప్రియుడి కోసం సౌదీ నుంచి తెలంగాణకు వచ్చింది. రూల్స్ ప్రకారం పాస్ పోర్ట్ తో వస్తే తన వివరాలు తెలుస్తాయని.. అక్రమంగా భారత్ కి ప్రవేశించింది. పడరాని కష్టాలు పడుతూ ప్రియుడిని చేరుకుంది. వివరాల్లోకెళితే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షేక్ అజీముద్దీన్ అనే 23 ఏళ్ల యువకుడు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వలస వెళ్లాడు.

అక్కడ ఓ వ్యాపారవేత్త దగ్గర డ్రైవర్ గా చేరాడు. కోన్నాళ్లకు తన యజమాని కుమార్తె రజా అల్ హర్బీ(27)కి ఇతడిపై ప్రేమ పుట్టింది. సౌదీలోని మ్యారేజ్ రూల్స్ ప్రకారం అక్కడ వివాహం చేసుకోవడం కుదరలేదు. దీంతో అజీముద్దీన్ 2018 జనవరిలో ఇండియాకి తిరిగి వచ్చాడు. అయినప్పటికీ అతడిపై ప్రేమను చంపుకోలేక పోయింది ఆ యువతి. సోషల్ మీడియా ద్వారా చాటింగ్, వీడియో కాల్స్, ఫోన్ మాట్లాడటం ఆపలేదు. ఈ క్రమంలో అజీముద్దీన్ పై పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ సౌదీ అమ్మాయి.. ఎలాగైనా ప్రియుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇండియాకు రావాలనకుంది. సౌదీలోని తన ఇంటి నుంచి అదే అడ్రస్ తో వీసాకు అప్లై చేస్తే విచారణలో ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భయపడింది. దీంతో తన ప్రేమ విషయం బయటపడితే ఇండియాకు రావడం వీలుకాదని భావించిన ఆ యువతి.. మే నెలలో టూర్ కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి, నేపాల్ కు చేరుకుంది.

అక్కడి నుండి అక్రమంగా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించింది. రోడ్డు, రైలు మార్గంలో హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి నిజామాబాద్ లో ఉంటున్న ప్రియుడు అజీముద్దీన్ ను కలుసుకుంది. మే నెలలోనే వివాహం చేసుకున్న ఈ ప్రేమజంట కాపురం పెట్టారు. కూతురు కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టాడు యువతి తండ్రి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా.. యువతి తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు. ముంబైలోని సౌదీ ఎంబసీసి ఆశ్రయించిన యువతీ తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. తన కూతురినీ ఇండియా డ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపారు. దీంతో CCS పోలీసులు స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగి, నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో తన ఇష్ట పూర్వకంగానే వచ్చానని యువతి చెప్పింది. అజీముద్దీన్ ఇండియాకు వచ్చిన ఐదు నెలల తర్వాత ఆమె రావడంతో కిడ్నాప్ కాదని తెలిపారు పోలీసులు. ఎంబసీ అధికారుల సమక్షంలో ఆ యువతి తిరిగి సౌదీ వెళ్తానంటేనే.. తండ్రికి అప్పగిస్తామని చెప్పారు పోలీసులు. ఇక్కడే ఉంటానంటే నివసించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలా.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. మొత్తానికి ప్రేమకు సరిహద్దులు లేవు అని ఈ యువతి నిరూపించింది.

Posted in Uncategorized

Latest Updates