ధావన్, రోహిత్ రన్ జుగల్బందీ… పాక్ పై మళ్లీ భారత్ విక్టరీ

దుబాయ్ : ఆసియాకప్ లో భాగంగా జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత్… పాకిస్థాన్ ను రెండోసారి ఓడించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ సెంచరీలు సాధించడంతో.. దాయాది దేశంపై 9 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మొదటినుంచి ఆసక్తి కలిగించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టాప్ ఆర్డర్ ఫెయిలైనా.. మిడిలార్డర్ పాకిస్థాన్ ను ఆదుకుంది. 16 ఓవర్లలో 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ను కనీసం రేసులో నిలబెట్టారు కెప్టెన్ సర్ఫ్ రాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్.  షోయబ్ మాలిక్ 78 రన్స్.. సర్ఫ్ రాజ్ అహ్మద్ 44 రన్స్.. ఆసిఫ్ ఆలీ 30 రన్స్ చేసి… పాకిస్థాన్ కు సవాల్ విసిరేంత స్కోర్ ను సాధించిపెట్టారు. ఓపెనర్ ఫఖర్ జమాన్ కూడా 31 రన్స్ చేసి ఫర్వాలేదనిపించాడు. మొత్తం 50 ఓవర్లలో పాకిస్థాన్ 7వికెట్లకు 237 రన్స్ చేయగలిగింది. భారత్ కు 238 రన్స్ టార్గెట్ ను పెట్టింది పాక్ టీమ్. భారత బౌలర్లు బుమ్రా, చాహల్, కులదీప్ యాదవ్ లు తలో 2 వికెట్లు పడగొట్టారు.

మొదటి మ్యాచ్ తో పోల్చితే పాకిస్థాన్ ఈసారి మెరుగ్గా ఆడటంతో.. ఫలితంపై ఉత్కంఠ కనిపించింది. ఐతే.. భారత ఓపెనర్ల బ్యాటింగ్ చూసిన కొద్దిసేపటికే… మన విజయం ఖాయమైపోయింది. శిఖర్ ధావన్, కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల జుగల్బందీ ఎలా ఉంటుందో చూపించారు. వికెట్లు నష్టపోకుండా ఓపెనర్లే మ్యాచ్ గెలిపించినంత పనిచేశారు. హాఫ్ సెంచరీ అయ్యాక.. రోహిత్ శర్మ తనకు దక్కిన లైఫ్ ను ఉపయోగించుకున్నాడు.

సింగిల్స్… డబుల్స్ తో పాటు.. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. ప్రేక్షకులకు కనువిందు చేశారు ధావన్, రోహిత్. పలు భారీ షాట్లతో పాకిస్థాన్ కు భారత దెబ్బ ఎలా ఉంటుందో చూపించారు. వేగంగా ఆడుతూ వచ్చిన ధావన్ .. 95 బాల్స్ లో 15 ఫోర్లు, 1 సిక్సర్ తో సెంచరీ పూర్తిచేశాడు. మొత్తం 100 బాల్స్ లో 16 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో.. 114 రన్స్ చేసిన ధావన్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే ఇండియా గెలుపు ఖాయమైంది. క్రీజులోకి వచ్చిన అంబటిరాయుడు జతగా..  106 బాల్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

చివరగా.. 39.3 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి ఇండియా 238 రన్స్ టార్గెట్ ను రీచ్ అయింది. మొత్తం 119 బాల్స్ లో 111 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు రోహిత్. అంబటి రాయుడు 12 రన్స్ తో నాటౌట్ గా ఉన్నాడు. పాకిస్థాన్ తో ఒత్తిడి ఉండే మ్యాచ్ లో దూకుడుగా ఆడి.. ఇండియా ఈజీ విక్టరీకి కారణమైన సెంచరీ హీరో శిఖర్ ధావన్ కు…  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఇన్నింగ్స్ తో వన్డే కెరీర్ లో 7వేల రన్స్ సాధించిన బ్యాట్స్ మెన్ క్లబ్ లో చేరాడు రోహిత్ శర్మ. ఇప్పటికే సూపర్ ఫోర్ కు చేరిన భారత్.. ఫైనల్లో అడుగుపెట్టింది.

 

Posted in Uncategorized

Latest Updates