ధ‌నిక రాష్ట్రాన్ని బికారిగా మార్చ‌డంలో, ప్ర‌జ‌ల్ని చంప‌డంలో నంబ‌ర్ వ‌న్

సీఎం కేసీఆర్ పాల‌న‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ రాష్ట్రం అన్నింటిలో నంబ‌ర్ వ‌న్ గా ఉందంటూ వ్యంగ్యంగా విమ‌ర్శించారు. ధ‌నిక రాష్ట్రాన్ని బికారి రాష్ట్రంగా మార్చ‌డంలో, ప్ర‌జ‌ల్ని చంప‌డంలో, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంలో రాష్ట్రం నంబర్ వన్ గానే ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఎన్జీవో సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా మారాయ‌ని ఆరోపించారు రాములు నాయ‌క్. ప్ర‌జ‌లంతా క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇబ్బందులు ప‌డుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కే ప‌రిమిత‌మ‌య్యార‌ని అన్నారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడంతోనే నిన్న గన్ పార్క్ వద్ద హ‌నుమంత్ నాయ‌క్ అనే‌ వ్యక్తి సీఎం కాన్వాయ్ కి అడ్డుప‌డ్డాడ‌ని చెప్పారు. కొన్ని రోజుల క్రింద టోలీచౌకి వద్ద ఒక మైనారిటీ వ్యక్తికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాన‌ని కేసీఆర్ చెప్పార‌ని, అయితే అస‌లు ఆ వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ అడగనే లేద‌ని కేసీఆర్ పెద్ద డ్రామా చేశార‌ని అన్నారు.

నాటి ఘ‌ట‌న‌ను చూసిన‌ హనుమంతు నాయక్ నిన్న‌ కేసీఆర్ ను కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అడిగేందుకు కాన్వాయ్ వద్దకు వెళ్ళాడని రాములు నాయ‌క్ చెప్పారు. కానీ ఆ వ్య‌క్తిని పోలీసులు అక్ర‌మ కేసులు పెట్టి మూడు నెల‌లు జైలులో ప‌డేయాల‌ని చూశార‌ని, కాంగ్రెస్ నేతలం క‌లిసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో పోలీసులు వెనక్కి తగ్గారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ కే ప‌రిమితం కాకుండా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవాల‌ని రాములు నాయ‌క్ డిమాండ్ చేశారు.

Latest Updates