నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దు : పోచారం

SEEDSనకిలీ  విత్తనాలతో  రైతులు మోసపోవద్దన్నారు  వ్యవసాయ మంత్రి  పోచారం శ్రీనివాసరెడ్డి.  అధిక దిగుబడి  వస్తుందని  చెప్పి మోసం చేస్తారని..  జాగ్రత్తగా ఉండాలన్నారు. గురువారం (మే-24) హైదరాబాద్ లోని  రాజేంద్రనగర్  అగ్రివర్సిటీలో  విత్తన మేళాని  ప్రారంభించిన  పోచారం… రైతు యూనిట్ గా  బీమా రావాలన్నారు.  మూడు అంశాల్లో  మాత్రమే  రైతు యూనిట్ గా  నష్టపరిహరం  వస్తోందన్నారు  పోచారం.

క్వాలిటీ విత్తనం నాటితేనే పంట దిగుబడి బాగుంటుందన్నారు. ప్రధానమంత్రి మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటున్నారు కాని.. అది ఎలా అనేది మాత్రం ఆయన చెప్పట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ముందుకెళ్లారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మాభిమానంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ప్రపంచంలో మొదటి సారి ఎకరాకు రూ. 8 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు పోచారం.  ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తున్నదన్నారు. శాస్త్రవేత్తల మేధాశక్తికి రైతుల శ్రమ తోడయితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.

ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రాయితీలతో పాటు మౌలిక సదుపాయలను కల్పిస్తున్నదన్న పోచారం.. మూల విత్తనంపై 50 శాతం సబ్సిడీని అందజేస్తామన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లు, తొక్కిసలాట, లాఠీచార్జీలు జరిగేవని.. కేసీఆర్ ముందు చూపుతో ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల కొరత లేదన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలం కోసం 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 8 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు పోచారం.

Posted in Uncategorized

Latest Updates