నటుడు, నిర్మాత, రెడ్ స్టార్ మాదాల రంగారావు మృతి

MADALAప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత మాదాల రంగారావు చనిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూన్న మాదాల….సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ సినిమాకి అప్పటి ఏపీ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది.
వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. మాదాల అభిమానులు ఆయనకు రెడ్ స్టార్ బిరుదిచ్చారు. ‘చైర్మన్ చెలమయ్య’ చిత్రంతో మాదాల సినీరంగ ప్రవేశం చేశారు. నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు నిర్మించారు. ఎర్ర మల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, నవోదయం, విప్లవశంఖం, బలిపీఠంపై భారతనారి, తొలిపొద్దు, ఎర్ర సూర్యుడు, జనం మనం, ప్రజాశక్తి, స్వరాజ్యం సినిమాల్లో మాదాల రంగారావు నటించారు. 1980ల్లో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు మాదాల.

Posted in Uncategorized

Latest Updates