నత్తనడకన వంతెన నిర్మాణపనులు : గోరీలపాడు తండా ప్రాంత ప్రజల అవస్ధలు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని తండాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై వంతెన లేకపోవడంతో గోరీలపాడు తండా పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు . వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా ….పనులు నత్తనడకన జరుగుతుండటంతో ….ఆ ప్రాంతవాసుల సమస్య తీరడం లేదు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గోరీలపాడుతో పాటు చుట్టు పక్కల 14 తండాలకు చెందిన ప్రజలు వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తండాలన్నీ నాగార్జునసాగర్ ఎడమ కాలువకు రెండు వైపులా ఉన్నాయి. ఈ తండాల్లోని జనం ఒక తండా నుంచి ఇంకోక తండాకు పోవాలంటే పెరిక సింగారం వంతెన లేదా మల్లాయిగూడెం వంతెన నుంచి వెళ్లాలి. అయితే తండాలకు వంతెన లేకపోవడంతో ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందంటున్నారు స్థానికులు.
సమస్యను మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పడంతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులు ప్రారంభమై కొంతకాలం వేగంగా జరిగాయి. అయితే కాలువకు నీటిని విడుదల చేయడంతో మధ్యలోనే పనులు నిలిపివేశారు. నీటి విడుదల నిలిపివేసినా తర్వాత కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో తండావాసుల సమస్య తీరడంలో ఆలస్యమవుతోంది.
వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదలై పనులు మొదలవడంతో తండావాసులు సంతోష పడ్డారు. కానీ పనుల ఆలస్యం కావడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏడాదిగా వంతెన పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని..దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు స్థానికులు. అధికారులు స్పందించి వంతెనను త్వరగా పూర్తయ్యేలా చూడాలంటున్నారు. వంతెన నిర్మాణం జరిగితే తమ కష్టాలు తీరుతాయంటున్నారు తండావాసులు. అధికారులు ఇప్పటికైనా వంతెన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates