నల్లగొండలో కాంగ్రెస్ కోటలకు బీటలు ఖాయం : కేటీఆర్

బేగంపేట్ : క్యాంప్ ఆఫీస్ లో.. సిరిసిల్ల నియోజకవర్గ నాయకులతో మంత్రి కేటీఆర్ ఎన్నికల సన్నాహక సమావేశం రెండోరోజు కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన  సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ హాజరయ్యారు.

సిరిసిల్ల నేతలు… పార్టీ కార్యకర్తలతో మంత్రులు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో శబ్దవిప్లవం రాబోతోందన్నారు. ప్రతిపక్షాల గూబ గుయ్ అనేలా జనం స్పందించబోతున్నారన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటలకు బీటలు వారుతున్నాయన్నారు. రాష్ట్రం మొత్తం అసూయపడేలా సిరిసిల్ల డెవలప్ అవుతోందన్నారు మంత్రి కేటీఆర్. రూ.200 కోట్ల అంచనాతో పాత సిరిసిల్లను డెవలప్ చేస్తున్నామన్నారు. మూడేళ్లలో సిరిసిల్లకు రైలొస్తుందని.. తంగెళ్లపల్లి దగ్గర రైలు స్టేషన్ వస్తుందన్నారు. అసెంబ్లీతో పాటు.. తర్వాత జరిగే వరుస ఎన్నికలకు సిరిసిల్లలో పార్టీ సిద్ధంగా ఉండాలన్నారు.

వారసత్వం ఇస్తే వచ్చేది కాదు: జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేటీఆర్ భాగస్వామ్యం చాలా కీలకం అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆస్తి మాత్రమే వారసత్వంగా వస్తుందని.. నాయకత్వం అనేది తెలివితేటలు, సామర్థ్యంతో వస్తాయన్నారు. సీఎం ఇచ్చిన అవకాశంతో కేటీఆర్ తానేంటో నిరూపించుకున్నారని చెప్పారు. ఒకప్పుడు ఐటీ, పరిశ్రమలంటే గుజరాత్, మధ్యప్రదేశ్ గుర్తొచ్చేవని… కేటీఆర్ వచ్చాక తెలంగాణ దూసుకుపోతోందన్నారు. అలాంటి నాయకుడు ఒక్క సిరిసిల్ల ప్రచారానికే పరిమితం కాకూడదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates