నాలుగేళ్ల తెలంగాణలో : పాలనలో ప్రత్యేకత.. శాంత్రిభద్రతల్లో భేష్

TELANGANAతెలంగాణ నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో.. కొత్త పాలనకూ నాలుగేళ్లు అయ్యాయి. అనుకున్న లక్ష్యాలను ఏంత వరకు సాధించింది? కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందా? పాలనలో గతానికి.. ఇప్పటికి తేడా ఏంటి? నాలుగేళ్ల తెలంగాణపై స్పెషల్ స్టోరీ.

తక్కువ కాలంలోనే రాష్ట్రం పాలనా పరంగా కొత్తదారుల్లో పోతూ తన ముద్రవేసింది. పాలనలో మార్పుల తెస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పాత 10 జిల్లాలను విభజించి 31 జిల్లాలకు పెంచింది. దీంతో అధికార యంత్రాంగం ప్రజలకు దగ్గరైంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు.

దశాబ్దాలుగా ఉన్న భూవివాదాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ఆరో నిజాం కాలం తర్వాత తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం ఇదే మొదటిసారి. మూడు నెలలు రెవెన్యూ యంత్రాంగం ఊరూరికీ వెళ్లి ప్రతి వ్యక్తి భూముల వివరాలు తీసుకుని రికార్డులతో సరిచూసి.. వివరాలను ఆన్ లైన్ చేశారు. వివాదాలు ఉన్న భూములను వేరుగా నమోదు చేసి తర్వాత పరిష్కరించాలని నిర్ణయించారు. పక్కాగా ఉన్న వివరాల ఆధారంగా బ్యాంకు ఖాతా పుస్తకం తరహాలో భూమి పాసుబుక్కులు ఇచ్చారు. దీంతో పాటే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు సాయాన్ని కూడా అందిస్తున్నారు. కొన్ని లోపాలు, పొరపాట్లు ఉన్నా వాటిని వెంటనే సరిచేయడానికి ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా చాలా తలనొప్పులు ఉండే భూరికార్డుల అంశాన్ని చేపట్టడమే పెద్ద సాహసంగా చెప్పుకోవచ్చు.

కొత్త రాష్ట్రం వచ్చాక సాధించిన పెద్ద విజయం.. శాంతిభద్రతలను కాపాడుకోవడం. తెలంగాణ వేరైతే నక్సలిజం పెరుగుతుందనీ, శాంతిభద్రతల సమస్య వస్తుందనీ గతంలో ఆంధ్ర నాయకులు సాకుగా చెప్పేవాళ్లు. దీన్ని తలకిందులు చేస్తూ శాంతిభద్రతలను కొనసాగించడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టుకుంది. అన్ని వర్గాలకు ఆశ్రయం, బతకానికి అవకాశం ఇచ్చే విలక్షణతతో ఐటీ రంగంలో, పారిశ్రామికంగా హైదరాబాద్ ముందుకు దూసుకుపోతోంది. తన ఆదాయంతోనే కొత్త రాష్ట్రం తెలంగాణను సంపన్న రాష్ట్రంగా నిలబెట్టింది. మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చుకోవడంతో పాటు దేశంలోనే అంతర్జాతీయ సదస్సులకు అందరూ కోరుకునే వేదికగా మారింది. గతంలో హైదరాబాద్ భవిష్యత్ పై ఆందోళన పడినవాళ్లే ఆశ్చర్యపడేలా చేసింది. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చి నిధులివ్వడంతో ఇది సాధ్యమైంది.

 

Posted in Uncategorized

Latest Updates