నాసా నూతన ప్రయోగం : సూర్యుడిపైకి అంతరిక్ష నౌక

మరి కొద్ది రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు గాను ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’అంతరిక్ష నౌకను వచ్చే నెల 6వ తేదీలోపు ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది నాసా. ఇప్పటివరకు ఎవరూ చేపట్టని ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తోంది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ డెల్టా–4 హెవీ లాంచింగ్‌ వెహికల్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది నాసా.

ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా ప్రవేశించని సూర్యుడి కరోనా కక్ష్యలో ఈ నౌక పరిభ్రమించనుంది. ఆ ప్రాంతంలో ఉండే వేడి, రేడియేషన్‌ను తట్టుకుని సౌర గాలులు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాన్ని కనుగొననుంది ఈ అంతరిక్ష నౌక. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పడంతో వృత్తాకారంగా కనిపించే సూర్యుడి రూపమే ఈ కరోనా. మరో విధంగా చెప్పాలంటే సూర్యుడి బాహ్యవలయం. ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు కొత్త ప్రయోగం ద్వారా ఈ కరోనా ప్రాంతంలో సమాధానాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Posted in Uncategorized

Latest Updates