నిజంగా భగవానుడే : ఆ టీచర్ కోసం స్కూల్ అంతా ఏడ్చింది.. వెళ్లొద్దని కాళ్లపై పడింది

teacher1సర్కార్ బడిలో చదివితే పిల్లోడు ఏమైపోతాడో అన్నంత భయం తల్లిదండ్రులది.. అందుకే అప్పులు చేసి, జీవితాలను ధారపోసి మరీ ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. అంతెందుకు సర్కార్ స్కూల్స్, కాలేజీల్లోని టీచర్లు, ప్రొఫెసర్లు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తారు.. ప్రభుత్వ స్కూల్ లో ఉపాధ్యాయులపై మన సమాజంలో ఉన్న అభిప్రాయం అలాంటిది.. కానీ నూటికో.. కోటికో ఒక్కరు మాత్రం ఉంటారు.. అతను మా సార్, గురువు.. గర్వంగా చెప్పుకుంటారు.. ఈ కాలంలో కూడా అలాంటి ఒక టీచర్ ఉన్నాడని.. సగర్వంగా చెప్పారు ఆ పిల్లలు.. సారూ మీకు హ్యాట్సాఫ్ అంటూ సలాం చేస్తోంది సమాజం.. పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలోని వెళియగరమ్ గవర్నమెంట్ హైస్కూల్. ఆ స్కూల్ లో జి.భగవాన్ (28) ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెబుతాడు. పేరుకు పంతులే అయినా పిల్లలతో మాత్రం ఫ్రెండ్ గా ఉంటాడు. ఆ స్కూల్ కు వచ్చేది అందరూ పేద విద్యార్థులు. అలాంటి పిల్లలతో ఎంతో ఆప్యాయంగా.. అనురాగంగా పలకరించేవాడు. స్కూల్ కు రాగానే పిల్లలను టిఫిన్ చేశారా అని అడిగివాడు. ఎవరైనా లేదు సార్ అంటే.. వెంటనే తన డబ్బులతో ఆకలి తీర్చేవాడు. ఆకలితో చదువు ఎలా ఎక్కుతుంది అని సున్నితంగా మందలించేవాడు. చెప్పేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినా.. మిగతా క్లాసుల్లో పిల్లలకు వచ్చిన డౌట్స్ కూడా క్లియర్ చేసేవారు. ఓ టీచర్ గా కంటే.. ఇంట్లో పెద్దన్నగా వ్యవహరించేవాడు భగవాన్. చదువుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటూ నిత్యం వారిలో ఉత్సాహం నింపేవారు. సాయంత్రం అయితే ఆటలతో వారిలో ఆత్మ విశ్వాసం నింపేవారు. అంతా హ్యాపీగా జరిగిపోతుంది అనుకున్న ఆ స్కూల్ పిల్లలకు ఓ బ్యాడ్ న్యూస్. భగవాన్ సార్ కు బదిలీ అయ్యింది.. వెళ్లిపోతున్నారు అనే వార్త విన్నారు ఆ పిల్లలు.

స్కూల్ మొత్తం భవవాన్ సార్ ను చుట్టుముట్టింది. పెద్ద పెద్ద ఏడుపులు.. సార్ మీరు వెళ్లొద్దు అంటూ పెద్ద పెద్ద కేకలు. మీరు ఇక్కడే ఉండిపోండి సార్ అంటూ పిల్లలు ఆ టీచర్ కాళ్లపై పడ్డారు. కదలనీయకుండా అడ్డుకున్నారు. స్కూల్ లో ఏడుపులు, కేకలతో ఏం జరుగుతుందో అని భయపడిన చుట్టుపక్కల వారు పరుగు పరుగు వచ్చారు. అక్కడి సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పిల్లల ఆవేదన చూసిన తర్వాతగానీ భగవాన్ మాస్టర్ విలువ తెలియలేదంటున్నారు. పిల్లల ఆప్యాయత, అనురాగంపై టీచర్ స్పందించారు. 2014లో మొదటిసారి నాకు ఈ స్కూల్ లోనే పోస్టింగ్ వచ్చింది. పిల్లల దగ్గర ఎప్పుడు టీచర్ అని కాకుండా.. వారిలో సీనియర్ గా బిహేవ్ చేశాను.. నేను చేయాల్సిన డ్యూటీ ఇది.. ఇందులో వింత ఏమీ లేదంటున్నాడు. నేను కూడా పేద కుటుంబం నుంచే వచ్చాను.. ఆ కష్టాలు నాకు తెలుసు.. అందుకే చదువుకోమని మరీమరీ చెబుతుంటాను అని చెప్పుకొచ్చాడు ఈ భగవాన్ మాస్టార్. తమిళనాడు వ్యాప్తంగా భగవాస్ సార్ వార్త, ఫొటోలు వైరల్ కావటంతో.. విద్యశాఖ దిగి వచ్చింది. ఆ మాస్టారి ట్రాన్స్ ఫర్ ను 10 రోజులు నిలిపివేసింది. ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ అంటున్నారు. ఆ స్కూల్ పిల్లలు మాత్రం.. మాస్టారును బదిలీ చేస్తే స్కూల్ కు వచ్చేది లేదని ఇప్పటికే అల్టిమేటం కూడా ఇచ్చారు.. ఇలాంటి మాస్టారు.. కోటికి ఒకరే కదా…

Posted in Uncategorized

Latest Updates