నిజామాబాద్ ప్రేమ కథ సుఖాంతం : విడగొట్టినోళ్లే.. విడిపోయిన చోట పెళ్లి చేశారు

marraigeఅవును.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. పెద్దలను ఎదిరించి గెలిచారు.. ప్రేమ గెలిచిందని గర్వంగా చాటుకున్నారు.. విడగొట్టినోళ్లే.. విడిపోయిన చోట మళ్లీ ఒక్కటి అయ్యి ప్రేమికులకు మనో ధైర్యం ఇచ్చారు. మూడు రోజులు ఉత్కంఠ రేపిన నిజామాబాద్ ప్రణదీప్ – సౌజన్య ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అయ్యారు ప్రణదీప్, సౌజన్య. విషయం తెలుసుకున్న సౌజన్య కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి పీటలు ఎక్కబోతున్న అమ్మాయిని ఆర్యసమాజ్ నుంచి ఎత్తుకెళ్లారు. బండిపై ఎత్తుకుని మళ్లీ తీసుకెళ్లారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రణదీప్ కూడా పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. ప్రియుడు ప్రణదీప్ ను మక్లూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే సమయంలో అమ్మాయి సౌజన్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా స్టేషన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పెళ్లికి వారు ససేమిరా అన్నారు. అయితే అమ్మాయి సౌజన్య మాత్రం గట్టిగా నిలబడింది. చావు అయినా.. బతుకు అయినా ప్రణదీప్ తోనే.. అతన్నే పెళ్లి చేసుకుంటా అని పోలీసుల ఎదుట ఖరాఖండిగా తేల్చిచెప్పింది.

కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరించారు. అమ్మాయి మేజర్ కావటంతో సౌజన్యను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జడ్జి ఎదుట కూడా ప్రణదీప్ తోనే ఉంటానని స్పష్టం చేసింది. సౌజన్య మేజర్ కావటంతో పోలీసులే పెళ్లి పెద్దలు అయ్యారు. ఎక్కడ అయితే విడిపోయారో అదే ఆర్యసమాజ్ లో పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్, కోర్టు వరకు వ్యవహారం వెళ్లటంతో.. అమ్మాయి తరపు కొంత మంది బంధువులు కూడా వచ్చారు. అబ్బాయి తరపు వారు కూడా అంగీకరించారు. మొత్తానికి విడగొట్టినోళ్లే.. విడిపోయిన ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్న నిజామాబాద్ ప్రేమ జంట పెళ్లి కథ సుఖాంతం అయ్యింది..

Posted in Uncategorized

Latest Updates