నిరుద్యోగులే టార్గెట్ : ఖమ్మంలో బయటపడిన ఘరానా మోసం

ఖమ్మంలో ఘరానా మోసం బయటపడింది. వసూళ్లే ప్రధాన అజెండాగా… పని చేసిన ఓ సంస్ధ ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసింది. ఉద్యోగాలు, ఇంట్రెస్ట్ ల పేరిట జనాన్ని నమ్మించి ఏకంగా ఏడు కోట్లతో బిచానా ఎత్తేసింది. దీంతో తాము దాచుకున్న సొమ్మును తిరిగి ఇప్పించాలంటూ ఆందోళనకు దిగారు బాధితులు.

పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న వీళ్లంతా… హ్యాపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటీవ్ సొసైటీ బాధితులు. నిరుద్యోగులే టార్గెట్ గా HFCS పేరుతో రాష్ట్రంలో 49 కి పైగా బ్రాంచీలను ఏర్పాటు చేసిందీ సంస్థ. అసిస్టెంట్ మేనేజర్ గా బ్యాంకు ఉద్యోగమంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి వసూళ్లకు దిగింది. మంచి ఇంట్రెస్ట్ ఇస్తామంటూ ప్రజల నుంచి కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల రూపంలో పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. రెండు రాష్ట్రాల్లో మొత్తంగా కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన గజారీ వెంకట్, గజారి రాములు సంస్థకు ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్, జోనల్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు కోట్లలో డబ్బులు వసూలు చేసి కంపెనీకి చెల్లిస్తూ వస్తున్నా… ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. దీంతో గుంటూరులోని రీజనల్ ఆఫీస్ కు వెళ్లి ఎంక్వైరీ చేశారు బాధితులు. అయితే అక్కడ ఖమ్మం బ్రాంచీ నుంచి డబ్బులు జమ కాలేదని తేలడంతో… చైర్మెన్, వైస్ చైర్మన్ ల పై కేసులు పెట్టారు. దీంతో అసలు కథ బయట పడింది.

బ్యాంకు ఉద్యోగం పైగా వేలల్లో జీతం ఇస్తామనడంతో…పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు నిరుద్యోగులు. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద 80 వేలు చెల్లించాలని చెప్పడంతో… అంత మొత్తం సంస్థకు చెల్లించారు. ఇందులో కొందరికి బ్రాంచి మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, రికవరీ ఉద్యోగులుగా నియామక పత్రాలు అందించారు. అలాగే లావాదేవీలు చేస్తున్నట్టు ప్రజలను నమ్మించి… రోజుకోసారి, వారానికోసారి, నెలకోసారి చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ ఖాతా, కరెంట్ అకౌంట్ ల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేశారు.

ప్రజలను నమ్మించేందుకు రిటైల్ కిరాణ షాపులను కూడా ఏర్పాటు చేసింది సంస్థ. ఎటువంటిగ్యారెంటీ లేకుండా రుణాలు ఇవ్వడంతో నిజమే అనుకుని పెద్దమొత్తంలో నగదు డిపాజిట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ముఠా డబ్బులు కోట్లల్లో వసూలు చేసినట్లు సమాచారం అందుతుంది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates