నిర్ణయించిన టైంలోనే పరీక్షల నిర్వహణ: కడియం

kadiyamనిర్ణయించిన సమయంలోనే అన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల నిర్వహణపై సెక్రటేరియట్ లో విద్యాశాఖ అధికారులతో శనివారం(ఫిబ్రవరి-17) మంత్రి కడియం శ్రీహరి సమీక్ష చేశారు. హైస్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రస్తుతం ఫర్నిచర్ బాగుందని.. వీలైనంత వరకు పరీక్షా కేంద్రాలు అక్కడే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్ మెంట్ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరిస్తామని కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఇచ్చిన పిలుపుతో పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మైనారిటీ సంస్థల్లో, సహకరించే ఇతర విద్యాలయాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి కడియం. ఇన్విజిలేటర్లు కూడా వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ టీచర్లను నియమించాలన్నారు. పేపర్లు దిద్దడంలో కూడా పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలే వినియోగించుకోవాలన్నారు. వీటికి సంబంధించి సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించుకుని రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణ జరిగే విధంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.

Posted in Uncategorized

Latest Updates