నిర్మల్ లో దారుణం: చిన్నారి కిడ్నాప్,అత్యాచారం

deathఎన్ని చట్టాలు…కఠిన చర్యలు చేపట్టినా..మహిళలు..బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు కొందరు మృగాళ్లు. ఇంటి బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలికకు ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పారు.. ఊరి పొలిమేరలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.. ఆ తర్వాత చిన్నారి తలను బండరాయికి మోది కిరాతకంగా హత్యచేశారు. ఈ దారుణం నిర్మల్‌ జిల్లాలో జరిగింది. సోన్‌కు చెందిన బాలిక(10) ఐదో తరగతి చదువుతోంది. శనివారం(జూన్-16) సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన తోకల ప్రవీణ్‌ కుమార్‌, తోకల గణేశ్‌లు చిన్నారికి మాయమాటలు చెప్పి దగ్గరల్లోని పాత కూచన్‌పల్లి గ్రామ పొలిమేరలోకి తీసుకెళ్లారు. తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు.

సాయంత్రం నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. ఫలితం లేకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి కోసం పోలీసులు రాత్రి నుంచే గాలింపు మొదలుపెట్టారు. ఎలాంటి సమాచారం లభించకపోవడంతో బాలిక కిడ్నాప్  సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్నారి ఫొటో, వివరాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌లలో పోస్ట్‌ చేశారు. వాట్సాప్‌ ద్వారా విషయం తెలుసుకున్న సోన్‌ గ్రామానికే చెందిన దాసరి శ్రీనివాస్‌.. శనివారం సాయంత్రం బాలికను ప్రవీణ్‌ కుమార్‌, గణేష్‌లు మోటార్‌ సైకిల్‌పై తీసుకువెళుతుండగా చూశానని తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

కూచన్‌పల్లి పొలిమేరలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పాప తలను బండరాయికి మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులు సైతం చలించిపోయారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితులకు మరణశిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

బాలిక స్నేహితురాలికి నిందితులిద్దరూ బంధువులు అవుతారని… తెలిసిన వారు కావడంతోనే చిన్నారి వారితో చనువుగా ఉండేదని సమాచారం. ఇదే అదనుగా ఆ ఇద్దరు వ్యక్తులు చిన్నారికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి హత్యాచారం చేశారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించగలిగారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates