నిర్లక్ష్యం ఎవరిది : స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి బలయ్యాడు. ఈ సంఘటన మంగళవారం (జూలై-10) హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లోని తారమతి గ్రామంలో జరిగింది. శాంతి నికేతన్ స్కూల్ కు చిందిన బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు చనిపోవటం విషాదం నింపింది. బుర్ర తన్వీష్(3) రోడ్డుపై ఆడుకుంటుండగా.. చిన్నారిని గమనించని స్కూల్ బస్సు డ్రైవర్.. బస్సును చిన్నారి పైనుంచి పోనిచ్చాడు. దీంతో తన్విష్ బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ వాదన మరోలా ఉంది. బాలుడి మృతి వెనక తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఉంది అంటున్నాడు. స్కూల్ పిల్లలను పికప్ చేసుకోవటానికి.. అదే ప్రాంతంలో బస్సు చాలాసేపు ఆగి ఉందని చెబుతున్నాడు. అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆ బాబు ఆడుకుంటున్నాడని.. దీంతో గమనించలేకపోయాను అంటున్నాడు. తప్పు ఎవరిది అయినా.. మూడేళ్ల ప్రాణం మాత్రం గాల్లో కలిసింది. అల్లరి చేస్తూ స్కూల్ కు వెళ్లాల్సిన చిన్నారి.. అదే స్కూల్ బస్సు కింద పడి చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates