నీ శాడిజం పాడుగాను : భరణం డబ్బులు చిల్లరగా ఇచ్చి షాక్

వారు భార్యభర్తలు.. మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరిదారిలో వారు బతుకుతున్నారు. విడాకుల సమయంలో ప్రతినెలా 25వేల రూపాయలు భరణం కింద చెల్లించాలని భర్తకు ఆదేశించింది కోర్టు. ఇంత వరకు బాగానే ఉంది.. అయితే రెండు నెలలుగా భర్త ఇవ్వాల్సిన భరణం ఇవ్వటం లేదని.. కోర్టుకెక్కింది భార్య. తనకు న్యాయం చేయాలని పిటీషన్ వేసింది. జూలై 24వ తేదీన ఈ కేసు విచారణ చేపట్టింది హర్యానా కోర్టు. భర్త కూడా కోర్టుకి హాజరయ్యాడు.

కొన్ని ఇబ్బందుల వల్ల భరణం చెల్లించలేకపోయాను అని.. ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్పాడు. ప్రస్తుతం 25వేల రూపాయలు ఇవ్వటానికి అంగీకరించాడు. ఆ వెంటనే.. ఓ పెద్ద బ్యాగ్ అందించాడు భార్యకు. జడ్జితోపాటు అందరూ షాక్ అయ్యారు. భార్య అయితే నోరెళ్లబెట్టింది. ఎందుకంటే.. తను ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని రూపాయి, 2 రూపాయల నాణేల రూపంలో ఇచ్చాడు. కేవలం రూ.400 మాత్రమే నోట్ల రూపంలో ఇచ్చాడు. అది కూడా నాలుగు 100 రూపాయల నోట్లు. మిగతా 24వేల 600 రూపాయలు చిల్లరగా ఉన్నాయి. అన్నీ రూపాయి, 2 రూపాయల నాణేలు. కోర్టు హాలులోనే భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కావాలనే ఇలా చేస్తున్నాడని.. ఇదో రకమైన వేధింపులు అంటూ చెప్పుకొచ్చింది. అతని దగ్గర డబ్బులు ఉన్నాయని.. నోట్ల రూపంలో ఇవ్వాలని జడ్జిని కోరింది.

దీనిపై భర్త తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించలేదని పిటీషన్ వేశారని.. డబ్బు ఇస్తే ఇలా మాట్లాడటం భావ్యం కాదంటూ వాదించారు. భరణం డబ్బులను నోట్ల రూపంలోనే ఇవ్వాలని.. చిల్లరగా ఇవ్వకూడదు అనే నిబంధన ఏదీ లేదని వాదించారు. చిల్లరగా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. దీంతో బడ్జి సైతం ఖంగుతిన్నారు. చిల్లర లెక్కింపునకు ముగ్గురు కోర్టు సిబ్బందిని నియమించారు. దీనిపై విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates