నెంబర్ చెప్తే చాలు : రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు

rationరేషన్‌ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా మరే రేషన్‌ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటును మే ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నామన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌.  గురువారం (ఫిబ్రవరి-23) ఆయన ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఈ–పాస్‌) ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునేలా పోర్టబులిటీని అమలు చేస్తామని చెప్పారు. డీలర్లకు రేషన్ కార్డు నెంబర్, ఆధార్ వివరాలను చెప్తేచాలని..ఇందుకు సందంధించి సరికొత్త సాఫ్ట్ వేర్ ని ప్రవేశపెట్టామన్నారు. దీంతో మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఏదైనా రేషన్‌ దుకాణంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. వలస వచ్చే కూలీలు ఎక్కడికి వెళితే అక్కడ రేషన్‌ సరుకులు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు సీవీ ఆనంద్‌.  రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామని.. త్వరలో మరో 15–20 మందిపైనా నమోదు చేయనున్నామని తెలిపారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు వ్యవహారం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 రేషన్‌ షాపులు ఖాళీగా ఉన్నాయని, వాటికి డీలర్ల ఎంపికపై ప్రభుత్వానికి ఫైలు పంపామని, అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 17 వేల రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని.. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈ–పాస్‌ విధానం ఎంతో సహాయపడిందన్నారు. రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా డీలర్ల అక్రమాలకు చెక్‌ పెట్టడంలో ఈ–పాస్‌ విజయవంతమైందని చెప్పారు సీవీ ఆనంద్.

 

Posted in Uncategorized

Latest Updates