మామూళ్లు కలెక్షన్స్ చేస్తున్నవారిపై యాక్షన్ : డీజీపీ

DGPఅక్రమాలకు, అవినతికి తెలంగాణలో ఏమాత్రం తావు ఉండకుండా పక్కా చర్యలు చేపడుతున్నారు రాష్ట్ర పోలీసులు. డబ్బుల కక్కుర్తితో పోలీసులు ఎలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసినట్లు తెలిసినా వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు DGP మహేందర్ రెడ్డి. గురువారం (జూన్-7) పోలీసు శాఖలో  ప్రక్షాళనకు  చర్యలు  చేపట్టారు  డీజీపీ మహేందర్ రెడ్డి.  నెలవారిగా మామూళ్లు  వసూలు  చేస్తున్నవారిపై  శాఖాపరమైన  యాక్షన్  తీసుకోవాలని నిర్ణయించారు.

హోంగార్డులు,  కానిస్టేబుళ్లు,  ASIలు  మొత్తం 350  మందిని  బదిలీ చేయాలంటూ  ఎస్పీలు,  కమిషనర్లకు  ఆదేశాలు  జారీ చేశారు.  నిఘా వర్గాల నుంచి అవినీతి  పరుల వివరాలు  తెప్పించుకున్న డీజీపీ.. ఆ లిస్టును  ఎస్పీలు,  కమిషనర్లకు పంపించారు. అవినీతికి దూరంగా ఉంటూ… ప్రజలకు పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పోలీసు సిబ్బంది పని చేయాలన్నారు డీజీపీ. ప్రతీ పోలీస్ స్టేషన్ లోని పనులను విభజించి, ఆయా విభాగాల బాధ్యతలను సిబ్బందికి అప్పగిస్తూ, మంచి ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రతీ నెల ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిఘా వర్గాల నుంచి అక్రమార్కుల వివరాలను తెప్పించుకున్న డీజీపీ అక్రమార్కులపై బదిలీ వేటు వేశారు.

ఇందులో ASI నుంచి హోంగార్డు వరకు ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాహినాథ్ గంజ్ కు చెందిన ASI బ్రహ్మం, కానిస్టేబుల్ మహేశ్, అసీఫ్ నగర్ పీఎస్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కె.అలెగ్జాండర్, గోల్కొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి.నగేశ్, టప్పాచబుత్ర పీఎస్ లో కానిస్టేబుల్ బి.శ్రీకాంత్, మంగళ్ హాట్ లో కానిస్టేబుల్ వై.సాంబయ్య, ఎ.బాలనర్సయ్య, కుల్సుంపురాకు చెందిన హోంగార్డు వేణు, పంజాగుట్టకు చెందిన శంకర్ నాయక్, చిలుకలగూడలో హోంగార్డులు రాంసింగ్, నాగరాజ్ లపై బదిలీ వేటు పడింది. వీళ్లంతా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, వాణిజ్య సంస్థలు, హోటల్స్ తోపాటు కేసులు ఎదుర్కొనే నేరస్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందులో కొందరు SI ల తరఫున వసూళ్లు చేస్తున్నట్టు… నిఘా వర్గాల నుంచి ఉన్నతాధికారులకు సమాచారం అందింది.

తెలంగాణ పోలీసు శాఖలో మొత్తం 391 మంది అవినీతిపరులున్నారు. పోలీసు శాఖలోని అవినీతిపరుల జాబితాను స్వయంగా డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. సూర్యాపేటలో అత్యధికంగా 40 మంది అవినీతిపరులు డిపార్ట్ మెంట్ లో ఉన్నారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 35, కరీంనగర్  34, వికారాబాద్  27, నిజామాబాద్  29 మంది అవినీతిపరులున్నారని జాబితాలో తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates