నేటి నుంచే పంపిణీ : కేసీఆర్ రంజాన్ గిఫ్ట్స్

KCR RAMZAN GIFTSపండుగలకు ప్రత్యేక కానుకలు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ..ముస్లింల కోసం గిఫ్టులు పంపిణీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ చీరలు, బోనాలకు ఎలా ఖర్చు చేస్తుందో..ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ముస్లింలకు రంజాన్ గిఫ్ట్స్ అందిస్తున్నారు సీఎం కేసీఆర్. పవిత్ర రంజాన్ ఉపవాసదీక్షలను పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు అందించాలనుకొన్న గిఫ్ట్ ప్యాకెట్లు సిద్ధమయ్యాయి.

టెస్కో ద్వారా తయారైన గిఫ్ట్ ప్యాకెట్లు హైదరాబాద్‌ లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి చేరుకొన్నాయి. జిల్లాల్లో పంపిణీచేసే ప్యాకెట్లను శనివారం (మే-26) ఉదయం 11 గంటలకు రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీమ్, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనరేట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసింలు ప్రత్యేక వాహనాల్లో పంపిస్తారు. అదేవిధంగా GHMC పరిధిలోని మసీదులకూ  పంపిస్తారు. ఈ నెలాఖరుకల్లా గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ పూర్తికావాలని టార్గెట్ గా  పెట్టుకొన్నారు. జిల్లాల్లో 400 మసీదులు, GHMC పరిధిలో 400 మసీదులను ప్యాకెట్ల పంపిణీకి సెలక్ట్ చేశారు. ప్రతి గిఫ్ట్ ప్యాకెట్లో ఒక కుర్తా, పయిజామా (5.50 మీటర్ల) దుస్తులు, మహిళల కోసం షల్వార్, కమీజ్ (5.50 మీటర్లు), చీర, బ్లౌజ్ (ఆరు మీటర్లు) చొప్పున మూడు జతల దుస్తులు ఉన్నాయి. ఒక నిరుపేద ముస్లిం కుటుంబానికి సరిపడే విధంగా వీటిని తయారుచేశారు.

ప్రతి మసీదులో 500 కుటుంబాలకు వీటిని అందజేస్తారు. అర్హులైనవారిని గుర్తించి వారికి గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసే బాధ్యతను ఆయా మసీదు కమిటీలకు మైనార్టీ సంక్షేమశాఖ అప్పగించింది. మైనార్టీ సంక్షేమశాఖ, వక్ఫ్‌బోర్డు అధికారులు, సిబ్బంది సమక్షంలోనే పంపిణీ జరుగుతుంది. తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (టెస్కో)తో మైనార్టీ సంక్షేమశాఖ మొత్తం 4 లక్షల గిఫ్ట్ ప్యాకెట్లను తయారుచేయించింది. నిరుపేద ముస్లింలూ రంజాన్ పండుగరోజు కొత్త దుస్తులు ధరించి పండుగను సంతోషంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో  వీటిని అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రంజాన్ సందర్భంగా అందజేసే ఈ దుస్తులను ఈ సారి మరమగ్గాలపై తయారుచేయడం ప్రత్యేకత.

 

 

 

Posted in Uncategorized

Latest Updates