నేడే జడ్జిమెంట్ డే..

హైదరాబాద్‌‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఇవాళ(మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు గెలుపు ఓటములపై క్లారిటీ రానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను కౌంట్‌ చేస్తారు. రాష్ట్రంలో 43 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 14 రౌండ్స్‌(టేబుల్స్) గా లెక్కింపు జరుగుతుంది. అత్యధికంగా శేరిలింగంపల్లి కౌంటింగ్‌‌ కేంద్రంలో 42 రౌండ్స్‌, తక్కువగా భద్రాచలం, అశ్వారావుపేట లో 13 రౌండ్స్‌ ఉంటాయి. బెల్లంపల్లిలో 15 రౌండ్స్‌ ఉంటాయి. 43 కౌంటింగ్‌‌ కేంద్రాల్లో మొత్తంగా 2,379 రౌండ్స్‌లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 11 గంటల తర్వాత పొలిటికల్‌ ట్రెండ్‌‌ తెలిసే అవకాశం ఉంది.

తొలి ఫలితం చార్మినార్‌, భద్రాచలం

ఓట్ల లెక్కింపులో చార్మినార్‌ నియోజకవర్గం ఫలితం ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో 2,00,418 ఓట్లు ఉండగా, 40.18 శాతం మేరకు అంటే 1,09,855 ఓట్లు పోలయ్యాయి. భద్రాచలం నియోజకవర్గంలో 1,37,319 ఓట్లు ఉండగా, 80.03 శాతం మేరకు అంటే 80,165 ఓట్లు పోలయ్యాయి.

చివరి ఫలితం శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీని పరిధిలో మొత్తం 5,75,541 మంది ఓటర్లు ఉండగా, 48.51 శాతం మేరకు పోలింగ్‌‌ నమోదైంది. 580 పోలింగ్‌‌ బూత్‌లలో పోలైన ఓట్లను 42 రౌండ్ల ద్వారా లెక్కించనున్నారు.

కౌంటింగ్‌లో 40 వేల మంది సిబ్బంది

ఓట్ల లెక్కింపు కోసం 3,356 మంది సిబ్బంది, 1,916 మంది ఎన్నికల కమిషన్ పంపించిన మైక్రో అబ్జర్వర్స్‌, 238 మంది బీఈఎల్‌ ఇంజినీర్స్ అందుబాటులో ఉంటారు. ఒక్కొ క్క నియోజకవర్గ కౌంటింగ్‌‌ సెంటర్‌కు 16 మంది మైక్రో అబ్జర్వర్స్‌ చొప్పున ఉంటారు. కౌంటింగ్‌‌ సెంటర్ల దగ్గర 20 వేల మంది పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంటారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఎన్నికల విధుల్లో ఉంటారు.

1,821 మంది అభ్యర్థులు

ప్రస్తుత ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో రిజిస్ట్రర్డ్ పొలిటికల్‌ పార్టీలు, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల నుంచి  515 మంది ఉండగా, మిగతా 1,306 మంది ఇండిపెండెంట్లు. ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ 119, బీజేపీ 118, కాంగ్రెస్‌ 99, బీఎస్పీ 107, సీపీఎం 26, ఎన్సీపీ 22, టీడీపీ 13, ఎంఐఎం 8, తెలంగాణ జనసమితి 4 , సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈనెల 7వ తేదీన జరిగిన పోలింగ్‌‌లో 73.2 శాతం ఓట్లు పో లయ్యాయి.

కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌

ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నలుగురికి మించి గుమికూడరాదు. ఎన్నికల కమిషన్‌, ఆర్వోలు జారీచేసిన గుర్తింపు కార్డులు  ఉన్న వ్యక్తులకు మాత్రమే కౌంటింగ్‌‌ కేంద్రాలు, వాటి పరిసరాల్లోకి అనుమతిస్తారు. కౌంటింగ్‌‌ కేంద్రంలోకి వచ్చేవారి దగ్గర మొబైల్‌ ఫోన్లు, వాటర్‌బాటిళ్లు, అగ్గిపెట్టె, సిగరేట్‌ వంటివి నిషేధం. కౌంటింగ్‌‌ సెంటర్ల దగ్గర పూర్తిస్థాయి సీసీ కెమెరాల నిఘా, పోలీసు బందోబస్తు ఉంటుంది. ఓట్ల లెక్కింపును ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. సామాజిక మాధ్యమాలపై  సైబర్‌ పోలీసుల నిఘా ఉంటుంది. వదంతులు వ్యాప్తి చేయడం, దూకుడుగా ప్రవర్తించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తారు.

Posted in Uncategorized

Latest Updates