నేడే బలపరీక్ష : బెంగళూరుకు చేరుకున్న ఎమ్మెల్యేలు

MLAకర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం శనివారం (మే-19) సాయంత్రం నాలుగు గంటలకు మొదలు కానుంది. బల పరీక్షకు గవర్నర్ 15రోజులు గడువు ఇచ్చినా… సుప్రీం కోర్టు దానిని ఇవాళే నిర్వహించాలని సూచించింది. సాయంత్రం 4గంటలకు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 11గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ K.G.బోపయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.

తర్వాత సాయంత్రం బలపరీక్ష ఉంటుంది. సీఎం యడ్యూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. రహస్య ఓటింగ్ కు సుప్రీంకోర్టు అనుమతించక పోవడంతో… హెడ్ కౌంట్ నిర్వహించాల్సి ఉంటుంది. బలపరీక్షలో నెగ్గుతామని… సీఎం యడ్యూరప్ప ధీమాగా చెప్పారు. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్-JDS ఎమ్మెల్యేలు కొందరు తమకు ఓటేస్తారని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు యడ్యూరప్ప. బలపరీక్షపై సుప్రీంకోర్టులో శుక్రవారం (మే-18) ఉదయం వాదనలు జరిగాయి. కాంగ్రెస్-JDS తరపున సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, చిదంబరం వాదించారు. యడ్యూరప్ప తరపున ముకుల్ రోహత్గీ వాదించగా… అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు సహాయకుడిగా వచ్చారు. వాదనలు విన్న జస్టిస్ సిక్రీ, జస్టిస్ బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్ ల బెంచ్… శనివారమే బలపరీక్ష జరగాలని నిర్దేశించింది. ప్రొటెం స్పీకర్ నియామకం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది. బలపరీక్షలో ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే పాల్గొనకుండా ఆపేసింది. సభలో మెజారిటీ నిరూపించుకునే వరకు విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోవద్దని కర్ణాటక గవర్నర్, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ లు శుక్రవారం  హైదరాబాద్ లో క్యాంప్ పెట్టాయి. సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా  హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మీటింగ్ తర్వాత శుక్రవారం (మే-18) అర్ధరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం ఐదు బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ చెందిన నేతలూ వెళ్లారు. ప్రస్తుతం కర్ణాటక పోలీసుల భద్రతలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల వాహనాలకు ముందు వెనుకా కాంగ్రెస్‌ శ్రేణుల వావానాలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో బస్సుల్లో బయలుదేరిన నేతలంతా సేఫ్ గా శనివారం (మే-19) ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు.  ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates