‘నోటా’ రివ్యూ… రొటీన్ పొలిటికల్ డ్రామా

బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘గీతగోవిందం’ ఇంకా థియేటర్స్‌ నుంచి వెళ్లకుండానే విజయ్‌ దేవరకొండ నుంచి ‘నోటా’ సినిమా వచ్చింది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న హీరో కావడం, తెలుగు, తమిళ భాషల్లో రూపొందడం, తెలుగునాట ఎన్నికల వేడిలో వస్తోన్న పొలిటికల్‌ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ‘నోటా’ అందుకుందో, లేదో సమీక్షలో చూద్దాం.

నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్, సత్యరాజ్, నాజర్, సంచనా నటరాజన్, ప్రియదర్శి, కరుణాకరన్ తదిత‌రులు
దర్శకత్వం : ఆనంద్ శంకర్
నిర్మాత : జ్ఞానవేల్‌ రాజా
కథ: షాన్ కరుప్పస్వామి
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫర్ : సంతాన కృష్ణన్ రవిచంద్రన్

కథ:
ముఖ్యమంత్రి వాసుదేవ్ కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ). ఓ కేసులో తాను జైలుకు వెళ్లాల్సి రావడంతో లండన్‌లో గేమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్న వరుణ్‌ను, తనస్థానంలో సీఎంగా ప్రకటిస్తాడు వాసుదేవ్ (నాజర్). రాజకీయాలపై అవగాహన, ఆసక్తిలేని వరుణ్‌, తండ్రి మాటను ఎదురుచెప్పలేక అయిష్టంగానే పదవిలోకి వస్తాడు. కేసు ఓడిపోవడంతో కొద్దిరోజులు జైలుపాలైన వాసుదేవ్‌, బెయిల్‌పై వస్తుండగా బాంబు దాడి జరిగి కోమాలోకి వెళ్తాడు. అప్పటివరకూ పేరుకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోన్న వరుణ్, రాష్ట్ర సంక్షేమం కోసం సీఎంగా అసలైన బాధ్యతలు అందుకుంటాడు. ఇందుకోసం తన శ్రేయోభిలాషి, తండ్రికి స్నేహితుడైన మహేంద్ర (సత్యరాజ్) సాయం తీసుకుంటాడు. మహేంద్ర కూతురే టీవీ రిపోర్టర్ స్వాతి (మెహ్రీన్ కౌర్). ఇక ప్రతిపక్ష పార్టీ నేత కూతురు, యువనేత కళ(సంచన నటరాజన్‌), సీఎంగా వరుణ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసి అతన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఓవైపు రాజకీయ ఒత్తిడులు, మరోవైపు తండ్రిపై దాడి చేసిందెవరు కనుక్కునే క్రమంలో వరుణ్‌కు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఈలోపు కోమాలో నుంచి లేచొచ్చిన వాసుదేవ్, కొడుకునే పదవిలోంచి దింపడానికి ప్రయత్నాలు చేస్తాడు. వీటనన్నింటినీ ఎదుర్కొని వరుణ్ ఎలా నిలబడ్డాడు, రౌడీ సీఎం అనే పేరు అతనికి ఎందుకు వచ్చింది మిగతాకథ.

ఎవరెలా..
యువ సీఎం వరుణ్ పాత్రలో విజయ్ దేవరకొండ విజృంభించాడు. ముఖ్యంగా బస్సు దహనం సన్నివేశాల్లో అబ్బురపరచాడు. ఇతర ముఖ్యపాత్రల్లో నాజర్, సత్యరాజ్, సంచన నటరాజన్‌, ఎంఎస్‌ భాస్కర్, ప్రియదర్శి మెప్పించారు. పేరకు హీరోయిన్ అయినా మెహ్రీన్ కౌర్‌ అతిథిపాత్ర పోషించిన భావన కలుగుతుంది. దర్శకుడు మురుగదాస్‌ అతిథిపాత్రలో మెరవడం విశేషం. సామ్ సి.ఎస్‌ అందించిన నేపథ్య సంగీతం, సంతాన క్రిష్ణన్‌ రవిచంద్రన్‌ సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టుగా సాగింది. స్టూడియోగ్రీన్‌ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.

సమీక్ష:
షాన్ కురుప్పసామి రాసిన తమిళ నవల ‘వెట్టాట్టం’ ఆధారంగా దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ సినిమా రూపొందించాడు. తెలుగు ప్రేక్షకులు గతంలో చూసిన ‘లీడర్’.. రీసెంట్‌గా వచ్చిన ‘భరత్ అనే నేను’ తరహాలో సాగే రొటీన్ పొలిటికల్ డ్రామా ఇది.తెలిసిన కథే అయినా ప్రథమార్థంలో ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ నడిపించిన దర్శకుడు, రౌడీ సీఎం అనే డైలాగ్‌తో విజయ్‌ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని ఇచ్చాడు. అయితే ద్వితియార్థంలో ఈ జోరు కొంత తగ్గింది. అయితే తనదైన శైలి నటనతో సినిమా బాధ్యత అంతా తన భుజాలపై వేసుకున్నాడు విజయ్‌. ‘నోటా’ అనే టైటిల్‌కు తగ్గ సన్నివేశాలు కానీ, తెలుగు రాజకీయ పార్టీలను ఇరకాటంలోకి నెట్టే అంశాలు కానీ ఇందులో లేవు. క్లైమాక్స్ లోని ఓ సీన్ మాత్రం కేటీఆర్‌ను గుర్తు చేస్తుంది.
సినిమా ఆద్యంతం తమిళ ప్రత్యక్ష రాజకీయాలకు దగ్గరగా ఉంది. సీఎం జైలుకు వెళ్లడం, వంగి దండాలు, అధినేత కాళ్లకు మొక్కడాలు, డమ్మీ సీఎంలు, రిసార్ట్ పాలిటిక్స్ వంటి అంశాలన్నీ తమిళ రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. అసలే తమిళ నేటివిటీ అని ఫీలయ్యే తెలుగు ప్రేక్షకుడికి సినిమా అంతా తమిళ నటీనటులే కనిపించడం ఇంకాస్త ఇబ్బందిపెట్టే అంశం. సత్యరాజ్, నాజర్ ప్లాష్ బ్యాక్ సీన్స్ నెమ్మదిగా నడుస్తోన్న కథకు అడ్డు తగిలాయి. తన యాక్టింగ్ అండ్ ఇమేజ్‌తో విజయ్ ఎంత ప్రయత్నించినా సెకండాఫ్ గ్రాఫ్ పడిపోయిందనే చెప్పాలి. ఫస్ట్ హాప్‌ తరహాలోనే సెకండాఫ్ కూడా కొనసాగి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. కామెడీ, సాంగ్స్ వంటి కమర్షియల్ హంగులు ఏవీ ఆశించకుండా, కేవలం ఓ పొలిటికల్‌ డ్రామాను చూద్దామని వెళ్లే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్. 2.25 / 5

Latest Updates