పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.  ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని సూచించింది. పంచాయతీ పాలక వర్గాల గడువు ఈ ఏడాది ఆగస్టులో ముగియడంతో.. ఆ నెల 2వ తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఇప్పటికే గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి.  ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకెక్కడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చింది. మూడునెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టంచేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

ఇప్పటివరకు కేటాయించిన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త రిజర్వేషన్లు వర్తించనున్నాయని.. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి, పాలకవర్గాలకు బాధ్యతలను అప్పగించాలని చెప్పింది. అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ ముగియగానే.. పంచాయతీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది అధికారయంత్రాంగం. 13 నుంచి 14 వరకు గ్రామాల్లో బీసీ ఓటర్ల లిస్టును ప్రచురించాలని నిర్ణయించింది పంచాయతీరాజ్‌ శాఖ. రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా మొదట రాష్ట్రస్థాయి కోటాను ఖరారు చేస్తారు. ఆ తర్వాత జిల్లాలవారీ రిజర్వేషన్ల కోటాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాల ప్రకారం.. 100 శాతం ఎస్టీలున్న 1,326 గ్రామాలతోపాటు మరో 1,308 గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించనున్నారు. 2,634 ఈ గ్రామాలను మినహాయిస్తే రాష్ట్రంలో ఇక 10 వేల 117 మైదానప్రాంత పంచాయతీలుంటాయి. వీటిలో జనాభా ఆధారంగా ఎస్టీలకు 5.73 శాతం (580 పంచాయతీలు), ఎస్సీలకు 20.46 శాతం (2,070 పంచాయతీలు) రిజర్వుచేశారు. వీటిని మినహాయించి, పాత చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం (3,440 పంచాయతీలు), జనరల్ క్యాటగిరీలో 4,027 పంచాయతీలు ఖరారుచేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates