పంచాయతీ ఎన్నికలు: మహిళలకు 50% రిజర్వేషన్


ఈసారి  పంచాయతీ ఎన్నికల్లో  మహిళల  హవా కొనసాగనుంది. 50 శాతం  రిజర్వేషన్ల  ప్రకారం మహిళలు పోటీ చేయనున్నారు.50 శాతం రిజర్వేషన్లతోపాటు..జనరల్ సీట్లలోనూ మహిళలు పోటీపడనున్నారు. రాష్ట్రంలో 12వేల 751 పంచాయతీలుండగా.. 50 శాతం రిజర్వేషన్ ప్రకారం 6వేల 378 పంచాయతీలను మహిళలకు రిజర్వ్ చేశారు. SC,ST,BC కోటా సీట్లలోనూ.. మహిళలకు సంగం కేటాయించారు. ఇవే కాకుండా జనరల్ సీట్లలోనూ మహిళలు సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పంచాయతీల్లో రిజర్వేషన్ల అమలుతో మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా.. రాజకీయంగా ఎదిగేందుకు వీలు కలిగింది. ఇన్నాళ్లూ మహిళలు ప్రజాప్రతినిధులుగా గెలిచినా.. వారి కుటుంబ సభ్యుల ఆధిపత్యమే నడిచేది.. కానీ రానురాను ఆ పరిస్థితి మారుతోదంటున్నారు మహిళా నేతలు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన మహిళలు.. పంచాయతీ స్థాయి నుంచే మంచి నేతలుగాఎదిగేందుకు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువతులు.. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవటంతో.. మహిళా సాధికారత సాధ్యమౌతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

ఈసారి సగానికి పైగా స్థానాల్లో మహిళలు పోటీ పడనుండటంతో.. టఫ్ ఫైట్ తప్పదంటున్నారు నేతలు. ముఖ్యంగా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ గనర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పంచాయతీల్లో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుంది. నగరానికి దగ్గరల్లోని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఎక్కువగా ఉండటంతో.. సర్పంచ్ పదవికి కూడా కోట్లు కుమ్మరించేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. తమ గ్రామాలు ఒకవేళ మహిళలకు రిజర్వ్ అయితే తమ కుటుంబంలోని మహిళలనే బరిలో నిలిపేలా ప్లాన్ చేసుకున్నారు. తమ ఇంటి ఆడపడచులు తమతోపాటు.. జనంలో ఉండేలా చూస్తున్నారు.

ఎన్నో పోరాటాలు, ఆందోళనలు.. 50 శాతం రిజర్వేషన్ల కోసం మహిళలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 80, 90 దశకాల్లోనే కృషిచేశారు కాకా వెంకటస్వామి. 1993లో పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మహిళలు సగానికిపైగా గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. రాజకీయంగా ఎదిగేందుకు తొలి మెట్టయిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచి.. సాధికారత వైపు అడుగులు వేయనున్నారు తెలంగాణ మహిళలు.

 

Posted in Uncategorized

Latest Updates