పంచాయతీ సమరం: ఒక బ్యాలెట్ పేపర్ పై 8 గుర్తులే

ballot-paperత్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రెడీ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అన్ని చర్యలను చేపడుతోంది. పోలింగ్‌లో కీలకమైన బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా ముందుగానే బ్యాలెట్‌ పేపర్లను ప్రింటింగ్  చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించింది. ఒక బ్యాలెట్‌ పేపరులో గరిష్టంగా ఎనిమిది గుర్తులు ఉండాలని స్పష్టం చేసింది. ఏడుగురు అభ్యర్థులతో పాటు నోటా గుర్తును ముద్రించాలని తెలిపింది.

ఎన్నికల్లో పోటీ చేసే వారిలో ఏడుగురి కంటే ఎక్కువ మంది ఉంటే రెండు బ్యాలెట్‌ పేపర్లు ప్రింట్ చేయాలని స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థుల గుర్తుల చివరలో నోటా ఉండాలని సూచించింది. రెండు బ్యాలెట్‌ పేపర్లు ఉంటే రెండో బ్యాలెట్‌ చివరలో నోటా ముద్రిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల పోలింగ్‌ బ్యాలెట్‌ పేపర్లలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మంగళవారం(జూన్-5) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. అంతేకాదు బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్ విషయంలోనూ పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

Posted in Uncategorized

Latest Updates