పంటలకు అవసరమైన నీటిని అందించండి : మంత్రి హరీష్

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పరిధిలో వేసిన పంటలను కాపాడడానికి వీలుగా ప్రభుత్వం చర్యల్ని తీసుకుంటుందని హామీ ఇచ్చారు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు. ఈ ప్రాజెక్టు కింద సాగులో ఉన్న సుమారు 7.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని పంటలకు అవసరమైన నీటి సరఫరాపై అధికారులతో సమీక్షించారు మంత్రి హరీష్. ఈ పంటలకు అవసరమైన మేరకు నీటిని అందించాలని ఇంజనీర్లను ఆదేశించారు ఆయన. శ్రీరాంసాగర్‌ మొదటి దశలో లోయర్‌ మానేరు డ్యాంకు ఎగువన ఉన్న 5 లక్షల ఎకరాలలో, లోయర్‌ మానేరు డ్యాం దిగువన ఉన్న మరో 2.30 లక్షల ఎకరాల్లో పంటను కాపాడటానికి నీటిని సరఫరా చేయాలని ఇంజనీర్లకు సూచించారు మంత్రి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు ఇప్పటికే ఆన్‌ ఆఫ్‌ పద్ధతితో 3 తడులు ఇచ్చామని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాశయంలో 65 టీఎంసీలు, లోయర్‌ మానేరు జలాశయంలో 8 టీఎంసీల నీరు ఉందని అధికారులు హరీష్ రావుకు వివరించారు.

లోయర్‌ మానేరు ఎగువన ఉన్న 5 లక్షల ఎకరాల పంటను కాపాడటానికి ఇంకా 18 టీఎంసీల నీరు అవసరమవుతుందని, మిషన్‌ భగీరథ అవసరాలకు మినహాయించుకొని లోయర్‌ మానేరు దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఖరీఫ్‌ పంటలకు ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో నీరు ఇవ్వగలమని అధికారులు మంత్రికి చెప్పారు. ఎస్సారెస్పీ మొదటి దశలో ఉన్న మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటలను కాపాడటానికి నీటిని అందించడంతో పాటు రెండో దశ ఆయకట్టు పరిధిలో ఉన్న మొత్తం 244 చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎస్సారెస్పీ ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని చెరువులను కూడా నింపడానికి చర్యకు తీసుకోవాలన్నారు మంత్రి హరీశ్‌రావు. అలాగే జనగామ జిల్లాలోని పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates