పంటలకు వాన దెబ్బ

సోయాబీన్​, పత్తిపై భారీ ప్రభావం

కొన్ని ప్రాంతాల్లో పంటలే వేయని రైతులుా

యాసంగి పంటలపై వాన దెబ్బ పడింది. అక్టోబర్​, నవంబర్​లలో పడాల్సిన దాని కన్నా భారీ వర్షాలు పడడం, వరదలు ముంచెత్తడంతో పంటలు వేయడం ఆలస్యమైంది. వేసిన పంటలు దెబ్బతిన్నాయి. 25 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద ప్రభావం పడింది. సోయాబీన్​, పత్తి, వరి, కూరగాయల పంటలే ఎక్కువగా నష్టాన్ని చూశాయి. వర్షాలు ఎక్కువగా పడడంతో రైతులు పంట వేయడాన్ని వాయిదా వేశారు. దీంతో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు, దేశ ఆర్థిక వృద్ధి ఏమంతబాగాలేని స్థితిలో రూరల్​ ఎకానమీపై ఈ వర్షాలు ప్రభావం చూపిస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ ఏడాది కోటి టన్నుల సోయాబీన్​ ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​ (ఎస్​ఈఏ), ఇప్పుడు వర్షాలతో పంటలు లేట్​ అవడం, ఉన్న పంటలు దెబ్బ తినడంతో అంచనాను 90 లక్షల టన్నులకు తగ్గించింది. దేశంలో 85 శాతం సోయా దిగుబడులు వచ్చే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్లే, ఉత్పత్తి అంచనాను తగ్గించినట్టు ఎస్​ఈఏ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ బీవీ మెహతా చెప్పారు. దిగుబడులు తగ్గడం వల్ల మూడున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా సోయాబీన్​ రేట్లు భారీగా పెరిగాయని అన్నారు.

పత్తిపైనా పెద్ద ప్రభావం

అకాల వర్షాలతో 50 శాతం పత్తి ఉత్పత్తయ్యే మహారాష్ట్ర, గుజరాత్​లలో పత్తి పంట బాగా దెబ్బతిన్నదని పత్తి వ్యాపారులు అంటున్నారు. మొదట్లో వర్షాలు మెరుగ్గా పడడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి ఉత్పత్తి 20 శాతం దాకా పెరుగుతుందని వ్యాపారులు భావించారు. కానీ, అతి వర్షాలతో ఆ పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్​ను బుల్​బుల్​ తుఫాను ముంచెత్తడంతో వరి ఉత్పత్తిపైనా ప్రభావం పడిందని రైస్​ వ్యాపారులు చెబుతున్నారు. భూములు తడిగా మారడంతో చెరకు క్రషింగ్​ లేట్​ అయిందని నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ కో ఆపరేటివ్​ షుగర్​ ఫ్యాక్టరీస్​ లిమిటెడ్​ హెడ్​ ప్రకాష్​ నైక్నవారే చెప్పారు. గోధుమ, వేరుశనగ, కూరగాయల పంటలు వేయడమూ ఆలస్యమైంది. భారీ వర్షాలతో ఉల్లితో పాటు కూరగాయల ధరలు భారీగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని, 7.89 శాతంగా నమోదైందని అంటున్నారు. అక్టోబర్​ నెలకు ఆర్​బీఐ పెట్టిన 4 శాతం టార్గెట్​ను దాటిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాలతో పంట వేయలేదు

మంచి వర్షాలు వస్తుండటంతో పంట బాగా చేతికి వస్తుందనుకున్నాం, కానీ, గత నెలలో ఎడతెరిలేని వర్షాల కారణంగా పంట వేయలేకపోయాం. ఇప్పుడు సోయాబీన్ వేసే పరిస్థితి లేదు.

– శాంతిబాయి చిఖాలే (65),
  మహిళా రైతు, కళంబ్​ (మహారాష్ట్ర)

Latest Updates