పండంటి బిడ్డను.. పది వేలకు బేరం పెట్టిన తల్లి  

పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. భూమ్మీదపడి మూడు నెలలే అయింది. ముద్దూ మురిపాలతో బిడ్డే లోకంగా ఆనందడోలికల్లో తేలియాడాల్సిన తల్లి… కన్నపేగును అంగట్లో పెట్టింది. రూ.10వేలకు బేరం కుదుర్చుకొని.. రూ.500 బయానాగా తీసుకొని శిశువును అప్పజెప్పేసింది. తన అనారోగ్య సమస్యలకు డబ్బు లేకపోవడం.. భర్తకు దూరంగా ఉండడంతో గుండె రాయి చేసుకొని ఆ తల్లి ఈ పనిచేసింది.

వివరాల్లోకెళితే..పైడాల రాజు, పద్మ అలియాస్‌ మంగ(25) దంపతులు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ ఇందిరా నగర్‌ లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 3 నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు.

భర్తతో గొడవల కారణంగా కొన్నాళ్లుగా పద్మ ఒంటరిగా ఉంటోంది. బిడ్డ తన దగ్గరే ఉంటే పోషణ కష్టం అవుతుందని భావించింది. గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె కాలికి గాయమైంది. ట్రీట్ మెంట్, మెడిసిన్స్ కు డబ్బు లేకపోవడంతో.. ఇబ్బందులు పడింది. బిడ్డ.. మరొకరి ఒడికి చేరితేనైనా మంచిగా పెరుగుతాడని, తనకు డబ్బులూ వస్తాయనుకుంది. శిశువును రూ.10వేలకు అమ్మేందుకు పరిచయస్తురాలైన కుమ్మరి లక్ష్మమ్మతో 23న బేరం కుదర్చుకుంది. అదేరోజు రూ.500 అడ్వాన్సుగా తీసుకొని లక్ష్మమ్మకు బిడ్డను అప్పగించింది. విషయం బయటకు పొక్కడంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచనల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. లక్ష్మమ్మ వద్ద ఉన్న పద్మ బిడ్డను నిన్న శిశువిహార్‌ కు తరలించారు. పద్మ, లక్ష్మ మ్మపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

Posted in Uncategorized

Latest Updates