పండుగ వాతావరణంలో…..గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. తండాలను పంచాయతీలు ప్రకటించడంతో గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. డప్పు దరువులు, తీన్మార్ డ్యాన్సులతో పల్లెల్లో సందడి కనిపించింది. ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త పంచాయతీల ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీలను మంత్రిజూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రభుత్వం చెప్పినట్టుగా…తండాలను పంచాయతీలుగా చేసిందని చెప్పారు. అటు తండాలు గ్రామాలుగా మారటంతో పల్లెల్లో పండగ వాతావరణం కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం నేలబండతండాలో సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు జనం.

అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కొత్త పంచాయతీలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా 274 పంచాయతీలను ఏర్పాటు చేశారు. బూర్గంపాడు మండలంలో కొత్తగా ఏర్పడ్డ నకిరిపేట గ్రామపంచాయతీని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో కొత్తగా 53 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చడంతో లంబాడాలు డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు 16 కొత్త గ్రామపంచాయతీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎమ్మెల్యే.

తండాలు.. గ్రామపంచాయతీలుగా మారడంతో గిరిజనులు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో స్వీట్లు పంచి పండగ చేసుకున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలను అందంగా ముస్తాబుచేశారు. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 4మున్సిపాలిటీలు, 101 పంచాయతీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేలు దివాకర్ రావు, నల్లాల ఓదెలు, దుర్గం చిన్నయ్యలు వేడుకల్లో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన లక్సెట్టిపేట మున్సిపాలిటీని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు.

సర్పంచుల పాలన ముగిసింది. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కొత్త, పాత కలిపి 1720 గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించారు జిల్లా కలెక్టర్లు. వీటికి తోడు కొత్తగా ఏర్పడ్డ 7 కొత్త మున్సిపాలిటీలకు ఎమ్మార్వో, ఎంపీడీవో స్థాయి అధికారులను ఇంచార్జ్ కమిషనర్ లుగా నియమించారు.

Posted in Uncategorized

Latest Updates