పత్తి రైతులకు నిద్ర లేకుండా చేస్తున్న పింక్ బోల్వామ్

మాయదారి పురుగు పత్తి చేన్లను పాడు చేస్తోంది. ఎంతో దిగుబడి వచ్చి కష్టాలు తీరుస్తుందనుకున్న పత్తిని.. గుట్టు చప్పుడు కాకుండా ఒలిచేస్తోంది. దాంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టి… సాగు చేసిన అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో.. పత్తి పంటపై గులాబీ రంగు కాయ తొలచు పురుగు  తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

పింక్ బోల్వామ్. ఈ పేరు వింటేనే పత్తి రైతుల గుండెలు ఆగినంత పని అవుతుంది. ఆదిలాబాద్  జిల్లాలోని చేన్లలో గులాబీరంగు పురుగు ప్రభావం ఇప్పటికే మొదలైంది. రెండేళ్లుగా పింక్ బోల్వామ్ అనే కాయ తొలచు పురుగు పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. 2016లో గులాబీ రంగు పురుగు రైతులను నట్టేట ముంచేసింది. గతేడాది పత్తిపంట వేసిన 90 రోజుల తర్వాత ఈ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ప్రభావాన్ని చూపింది. ఈసారి అయితే పంట వేసిన నెలరోజుల్లోనే పూతలు, కాయలను తొలవడం మొదలుపెట్టింది.

ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్, తలమడుగు, ఇంద్రవెల్లి మండలాల్లో అక్కడక్కడా గులాబీ కాయ తొలచు పురుగు తెగులు కనిపిస్తోంది.  పంటపై ఆశలు వదులుకున్న రైతులు.. చేన్లలో పశువులను మేపుతున్నారు. కొందరు చేన్లను కొట్టేసి కాల్చివేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకి దాదాపు 10నుంచి 15వేల రూపాయలు ఖర్చు చేశామంటున్నారు. కౌలుకి తీసుకొని పత్తిసాగు చేస్తున్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎకరాకి 25వేలు కౌలు, పంటకి 10వేలు.. మొత్తం 40వేల పెట్టుబడి పెట్టామంటున్నారు. గులాబీ రంగు పురుగు ప్రభావం ఉందని తెలిసినా.. ఈసారి ఏమీ కాకపోవచ్చన్న ధీమాతో పత్తిసాగు చేశారు రైతులు. పింక్ బొల్వామ్ పై వ్యవసాయశాఖ అధికారులు తమకు అవగాహన కల్పించలేదంటున్నారు అన్నదాతలు. పరిహారం ఇవ్వడంతో పాటు.. మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు ఉచితంగా మందులుఇవ్వాంటున్నారు.

జిల్లావ్యాప్తంగా దాదాపు 2 వేల ఎకరాల్లో చీడల తీవ్రత ఏర్పడింది. జామిడి గ్రామంలో దాదాపు 1500 ఎకరాల్లో పత్తి పంట సాగుచేస్తే 800 ఎకరాలకు పైగా పింక్ బోల్వామ్ వచ్చింది. పత్తి మొక్క ఏపుగా పెరిగి కాయ చూడడానికి బయటకు బాగానే ఉన్నా లోపల గుల్లగా మారుతోంది. ఆకుల కింద, కొమ్మలు, పూల మొగ్గలు, కాయలపైన పెట్టిన గుడ్లు చిన్న పిల్ల పురుగులుగా మారుతాయి. తర్వాత పూల మొగ్గల్లోకి తొలుచుకెళ్లి.. లోపల పదార్థాలను తిని వాటిని డొల్లా పూలుగా మారుస్తాయి. కాయలకు చిన్న రంధ్రాలు చేసి లోనికి వెళ్తాయి. పురుగు కాయలోనే ఉండి గింజలను తింటూ పత్తి పంటకు నష్టం కలిగిస్తుంది. పత్తి దూది, పింజా రంగు మారి, నాణ్యత దెబ్బతినడమే కాకుండా బరువు తగ్గిపోతుంది. కాయ పగిలాకే ఈ పురుగును పూర్తిస్థాయిలో గుర్తించగలుగుతారు.

గులాబీ రంగు పురుగును నీమ్ ఆయిల్ స్ప్రేతో నివారించవచ్చు. ఒకసారి ఈ పురుగు సోకిన పంటకు.. సీజన్ అయిపోగానే మళ్లీ దాని ప్రభావం ఉండకుండా.. పంట తీశాక గొర్రెలు, మేకలు, పశువులను మేపి పత్తి మొదళ్లను ట్రాక్టర్లు, రోటావేటర్ తో కలియదున్నాలి. పత్తి మొదళ్లను నిల్వ చేయొద్దు,.  పాటు జిన్నింగ్ మిల్లుల్లో నిల్వ ఉంచిన పత్తి గింజల్లో కూడా గులాబీరంగు పురుగు ఉంటుందంటున్నారు. బిటీ విత్తనాలపై ఈ గులాబీ రంగు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.  గులాబీరంగు తెగులు పురుగు నష్టంపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గతేడాది బీటీ విత్తనాలపై నిషేదం విధించింది. మన రాష్ట్రంలో బిటీ విత్తనాల సరఫరా ఉండటంతో గతేడాది కంటే ముందుగానే ఈ పురుగు పంటపై దాడి చేసింది. అయితే పురుగు నివారణకు చేసే పిచికారి మందులతో పాటు గులాబీరంగు పురుగు ఆకర్షణ బుట్టలను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలంటున్నారు రైతులు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గులాబీ రంగు కాయ తొలుచు పురుగు రెండేళ్లుగా పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, రాయికోడ్, సంగారెడ్డి, వట్ పల్లి, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్  మండలాల్లో పత్తిని ఎక్కువగా సాగుచేస్తున్నారు రైతులు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఇప్పటివరకు 77,866 ఎకరాలలో సాగైంది. దుక్కులు సిద్ధం చేసి, విత్తనాలు వేయడం వరకు బాగానే ఉన్నా..పంట ఏపుగా పెరిగిన వెంటనే చీడపీడలు పట్టి పంట పాడవుతుంది. ఎక్కువగా ప్రమాదకరమైన గులాబీ రంగులో ఉండే కాయ తొలిచే పురుగుతో సమస్యగా ఉంటోంది. దిగుబడి ఊహించని విధంగా పడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు పొలాల్లో గులాబీ తెగులును గుర్తించారు.

గులాబీ పురుగుకు తోడు కొన్నిచోట్ల నకిలీ విత్తనాలు కూడా రైతులను ఆగం చేస్తున్నాయి. పైగా రైతులకు ప్రధానమంత్రి బీమా యోజనపై అవగాహన లేకపోవడంతోనూ నష్టం వచ్చినప్పుడు పరిహారం అందడంలేదు. నిరుడు గులాబీ రంగు కాయతొలిచే పురుగుతో రైతులు నష్టపోయినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. అయినా ఇప్పటివరకు చాలామంది రైతులకు పరిహారం అందనేలేదు. కౌలు రైతును తీవ్రంగా దెబ్బతీస్తోంది గులాబీ రంగు కాయతొలిచే పురుగు. గతేడాది ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పురుగు సోకకుంటే ఎకరానికి 10-15 క్వింటాళ్ల వరకు వచ్చేది. అంటే ప్రతి ఎకరానికి 25 నుంచి 30వేల వరకు నష్టం జరిగిందంటున్నారు రైతులు. ఈసారి కూడా పత్తి చేనుకు అక్కడక్కడ గులాబీ రంగు కాయ తొలిచే పురుగు సోకింది. దీని నివారణపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలంటున్నారు రైతులు.

ఉమ్మడి వరంగల్ జిల్లా 6లక్షల 50వేల  ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు రైతులు. ఎక్కువ దిగుబడి వచ్చి మంచి లాభాలు వస్తాయనుకున్న అన్నదాతల ఆశలపై.. చీడ పురుగు నీళ్లు చల్లింది. పేను బంక, గులాబీ రంగు పురుగు, తెల్ల దోమ,ఆకులు ఎండు తెగుళ్లతో పత్తి చేను ఎదగడం లేదు. కాస్త పెరిగి పూత వచ్చిన పత్తి చెట్టు నిలవటం లేదు. వాతావరణ పరిస్థితులతోనే పత్తికి గులాబీ రంగు పురుగు పట్టిందని చెబుతున్నారు రైతులు. మబ్బులకు పత్తి చేన్లపై గులాబీ రంగు పురుగు సోకి.. నష్టం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఉంది.  నివారణ కోసం పురగు మందు చల్లినా తగ్గటం లేదంటున్నారు రైతులు.  గులాబీ రంగు పురుగు లేత ఆకుల కింది బాగాన, కొమ్మల పైన,కాయలపై గుడ్లను పెడుతుందని చెబుతున్నారు.

ఈ మధ్యే కురిసిన వర్షాలతో పత్తి చేనులో నీరు నిలిచి..ఎదుగు లేకుండా పోయింది. చేను ఎర్రబారి పత్తి పెరగటం లేదు. ఆకులకు రంధ్రాలు పడుతున్నాయి. ఎరువులు చల్లినా.. మందులు పిచికారీ చేసినా పురుగు ఉదృతి తగ్గటం లేదంటున్నారు రైతులు. పంట వేసిన 45 రోజుల్లో పత్తికి తెగుళ్లు సోకటంతో ఇప్పటికి మూడు నాలుగు సార్లు మందు మందులు పిచికారీ చేశామంటున్నారు. గులాబీ రంగు పురుగును గుడ్డు దశలోనే నివారించాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. క్లోరోపైరిఫాస్  మందును 25 ఎం.ఎల్  లేదా థయోడికార్ఫ్  1.5 గ్రాములు, లేదా ప్రొఫెనోఫాస్  2 ఎం.ఎల్ ను లీటరు నీటి చొప్పున కలిపి వారం, పది రోజుల్లో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలంటున్నారు. ఎకరానికి నాలుగు పురుగు ఆకర్షక బుట్టలను ఏర్పాటు చేసి రోజూ పురుగు కదలికలను గుర్తించాలని సూచిస్తున్నారు.  వ్యవసాయ అధికారులు పత్తి చేలను సందర్శించి…తెగుళ్లను గుర్తించాలంటున్నారు రైతులు.  తమకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలంటున్నారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates