పదిరోజుల్లో ఊహకందని మేనిఫెస్టో: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా: సిద్ధిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో పర్యటించారు రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు. రాబోయే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావుకే ఓటు వేస్తామని ఈ గ్రామం ఇటీవల ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గ్రామంలో పర్యటించిన హరీష్ రావు.. స్థానికులకు ధన్యవాదాలు చెబుతూ ఉద్వేగంగా ప్రసంగించారు.

“రాంపూర్ గ్రామంలో మూడోసారి ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలు వస్తే నాయకులు ఇంటి చుట్టు తిరుగుతారు… కానీ మీరు నా చుట్టూ తిరిగి ఏకగ్రీవం చేశారు. ఈ అభిమానం చూస్తుంటే ఏ జన్మలో చేసిన పుణ్యమో అని అనిపిస్తుంది. మీ కష్టంలో ఉంటా… మీ సుఖంలో ఉంటా… మీకు ఎంత చేసినా తక్కువే” అన్నారు.

“సీఎం కేసీఆర్ చెప్పినవి, చెప్పనివీ అన్నీ చేశారు. ఎవరి ఊహలకు అందని… తెలంగాణ పురోభివృద్ధి కోరుతూ.. అద్భుతమైన మేనిఫెస్టో తయారవుతోంది. వారం, పది రోజుల్లో మేనిఫెస్టో బయటకు రాబోతోంది” అని హరీష్ రావు చెప్పారు. వచ్చే వానాకాలం నాటికి గోదావరి నీళ్ళు తీసుకువచ్చి ప్రతి చెరువు, ప్రతి కుంట నింపుతామన్నారు. సిద్దిపేటకు త్వరలోనే రైలు, జాతీయ రహదారులు వస్తాయన్నారు. ఈ నెల 5 వ తేదీన సిద్దిపేట పట్టణంలో 5 రూపాయలకు భోజన పథకం ప్రారంభిస్తామన్నారు. 60 రోజులు తమకోసం కష్టపడితే ఐదేండ్లు కంటికి రెప్పలా కాపాడుతా అని స్థానికులకు హామీ ఇచ్చారు హరీష్ రావు.

Posted in Uncategorized

Latest Updates