పరకాల పాలిటిక్స్ హాట్ హాట్ : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం

రాష్ట్రంలో  రాజకీయాలు  వేడెక్కుతున్నాయి. మున్సిపాలిటీలు,  కార్పొరేషన్లలో  అవిశ్వాస తీర్మానాల  రచ్చ నడుస్తోంది.  దాంతో  ఇన్నాళ్లు కలిసి,  మెలిసి  ఉన్నవాళ్ల  మధ్య  గ్యాప్ పెరుగుతోంది.  వరంగల్  రూరల్ జిల్లా  పరకాల మున్సిపాలిటీ  చైర్మన్  అధికార పార్టీని  వీడి కాంగ్రెస్ లో  చేరాడు. దాంతో  13మంది  కౌన్సిల్  సభ్యులు  చైర్మన్ పై  అవిశ్వాసం పెట్టారు. దీంతో పరకాల  పాలిటిక్స్  హాట్ హాట్ గా  మారాయి.

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపల్ ఛైర్మన్ , వైస్  ఛైర్మన్  పై ప్రవేశ పెట్టిన అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రెండు వర్గాలకు చెందిన కౌన్సిలర్లతో శిబిరాలు కొనసాగుతున్నాయి. అవిశ్వాసం నెగ్గేందుకు కావాల్సిన మెజారిటీ ఉందని ధీమాతో ఉంది అధికారపక్షం. అయితే అందులో నుంచి ఒకరిద్దర్ని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్  నేతలు.  పరకాల మున్సిపల్ చైర్మన్ రాజ భద్రయ్య టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయి. దాంతో 13 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ రాజ భద్రయ్యపై వరంగల్ రూరల్ కలెక్టర్ హరితకు అవిశ్వాస పత్రాన్ని అందించారు. దీంతో కలెక్టర్ ఈనెల 26న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చైర్మన్ గా ఉన్న రాజభద్రయ్య తన పదవిని కాపాడుకునేందుకు ప్యూహాలు వేస్తున్నారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ సభ్యులతో క్యాంపు నడిపిస్తుండగా, కాంగ్రెస్  పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపులు నడుస్తున్నాయి. అవిశ్వాసం నెగ్గడానికి 14మంది సపోర్ట్ అవసరం. ప్రస్తుతం టీఆర్ఎస్ వైపు 13మంది ఉన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఓటును కలిపితే ఆ సంఖ్య సరిపోతుందన్న ధీమాలో ఉన్నారు అధికార పార్టీ లీడర్లు. పరకాల మున్సిపాలిటీ మొత్తం 21మంది కౌన్సిలర్లు ఉన్నారు. స్వతంత్ర కౌన్సిలర్ గా గెలిచాడు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ రాజభద్రయ్య. ఇక ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు, ఇద్దరు బీజేపీ, టీఆర్ఎస్ కు పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది.

దాంతో ఎస్సీ అయినా రాజభద్రయ్య టీఆర్ఎస్ లో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నాలుగేళ్లుగా అంతా మంచిగా ఉన్నా…ఈ మధ్యే కౌన్సిల్ సభ్యుల మద్య విభేదాలు తారాస్థాయికి చేరి పార్టీ వీడే వరకు.. అవిశ్వాసం పెట్టే వరకు వచ్చింది. వీటితో ప్రజాధనం ఖర్చువటం తప్పా..ప్రజలకు ఒరిగేదేమీ లేదంటున్నారు విద్యావేత్తలు. రెండు వర్గాలకు చెందిన కౌన్సిలర్లు క్యాంపుల్లో ఉండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే చైర్మన్ పదవి ఎవరికి దక్కతుందనేది ఈనెల 26న తెలిసే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates