పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగు మొదలైంది. గోదావరి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండుకోగా… పైన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తుంది. రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. కర్ణాటక నుంచి నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129 TMCలు కాగా ప్రస్తుతం 103TMCలకు చేరింది. వరద మరో రెండ్రోజులు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నారాయణపూర్ కు నీటిని వదలనున్నారు.

ఆల్మట్టి దగ్గర లక్ష క్యూసెక్కులతో మొదలైన ప్రవాహం సోమవారానికి(జూలై-16) లక్షా 11 వేల క్యూసెక్కులకు పెరిగింది. గడచిన 24 గంటల్లో మహాబలేశ్వరం సహా పశ్చిమ కనుమల్లో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 22 దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో కృష్ణా నదికి వరద మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.

కృష్ణా నదికి వరద ప్రవాహం మొదలై 15 రోజులు దాటింది. కానీ ప్రాజెక్టులకు వచ్చి చేరుతున్న నీటిని కర్ణాటక ప్రభుత్వం…చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు తరలించింది. దాదాపుగా ఆల్మట్టి పరిధిలోని అన్ని చెరువులను నింపింది. దీంతో ప్రస్తుతం వస్తున్న నీటిని దిగువకు వదలాలని నిర్ణయించింది. ప్రాజెక్టు 115 TMCలకు చేరగానే, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్ కు నీటిని వదలాలని చూస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహంతో రేపటి(బుధవారం) మధ్యాహ్నానికి ఆల్మట్టిలో నీరు దాదాపు 120 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. ఇదీ ఇలాగే కొనసాగితే నారాయణపూర్  నుంచి నాలుగు రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవాహం మొదలవుతుంది. అటు తుంగభద్రలోకి కూడా భారీగా వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 100 TMCలు కాగా.. ఇప్పటికే 77 TMCలకు నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం వస్తున్న 69 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగితే ఐదు రోజుల్లో గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈ లోగా వరద ప్రవాహం పెరిగితే శ్రీశైలానికి ఐదారు రోజుల్లో వరద మొదలవుతుందని సాగునీటి శాఖ అధికారులు ఆంచనా వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates