పరిష్కారం దొరికేసింది : మెట్రో స్టేషన్లలో స్మార్ట్ పార్కింగ్

మెట్రో ప్రయాణికుల పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. పరిష్కారం దొరికేసింది. హై టెక్నాలజీతో స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర అధునాతన స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది HMR సంస్థ. ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థ ఆధారంగా మియాపూర్‌–అమీర్‌ పేట్‌–నాగోల్‌ రూట్ లోని 24 మెట్రో స్టేషన్ల దగ్గర ఈ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. పబ్లిక్‌, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

మెట్రో స్టేషన్ల దగ్గర.. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ పక్కనున్న స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ మీ వాహనాన్ని పార్క్ చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సమయంలో ఆయా స్టేషన్ల దగ్గర పార్కింగ్‌ స్థలం అందుబాటులో ఉందా.. లేదా అనే విషయాన్ని కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 24 మెట్రో స్టేషన్ల దగ్గర ఏర్పాటు చేయనున్న పార్కింగ్‌ ప్రదేశాల్లో 4 వేల టూవీలర్స్,  400 కార్లకు అవకాశం ఉంది.

పార్కింగ్‌ ఫీజు కూడా ఆన్‌ లైన్, యాప్‌ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. టూవీలర్ కు గంటకు రూ.3, కారుకి 8 రూపాయలుగా నిర్ణయించారు. భద్రతను ట్రాఫిక్ పోలీసులతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ బాధ్యత తీసుకుంటుంది. వాహనాలు ఎండకు ఎండకుండా, వర్షానికి తడవకుండా ఉండేందుకు.. షెల్టర్లను కూడా నిర్మించారు. ఫ్రీ వైఫై కూడా ఉంది. అతి త్వరలోనే మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates