పర్యాటకులపై మంత్రి ఆగ్రహం: గోవాను చెత్తగా మారుస్తున్నారు

goaగోవాకి వచ్చే పర్యాటకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్. గోవాకి వచ్చే చాలామంది పర్యాటకులు పనికిమాలినవారేనని, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. శనివారం(ఫిబ్రవరి10) గోవా బిజ్ ఫెస్ట్ లో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర జనాభా కంటే ఏటా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు అధికంగా ఉందన్నారు. గోవాలో ప్రస్తుత సమస్యలకు ఉత్తరాది రాష్ట్రాలే కారణమంటూ, అక్కడి వారు గోవాను మరో హర్యానాలా మార్చాలనుకుంటున్నారని అన్నారు. కొన్ని రోజులు సేదతీరడానికి వచ్చే వీళ్లకి ఎలా అవగాహన కల్పించేదని ఆయన ప్రశ్నించారు. సామాజిక, రాజకీయ అవగాహన, ఆదాయం, ఆరోగ్యం విషయంలో దేశంలో అందరికన్నా గోవా ప్రజలు ముందున్నారన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా మా గోవా వాళ్లు ఉన్నతులని సర్దేశాయ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి సర్దేశాయ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదని, దేశీయ పర్యాటకులందరినీ పనికిమాలినవారని అనలేదని, కొన్ని వర్గాల వల్ల మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయని మాత్రమే తెలిపానన్నారు. తనవి విద్వేషపూరిత వ్యాఖ్యలు కాదని, కేవలం గోవా ప్రజల మనోగతాన్ని మాత్రమే చెప్పానని ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates