పర్యాటక కేంద్రంగా శామీర్ పేట చెరువు : కేసీఆర్

హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న శామీర్‌ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాలన్నారు సీఎం కేసీఆర్. శామీర్‌ పేట చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా మార్చనుంది. ఈ అంశంపై సోమవారం (జూలై-30) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం ఏర్పాట్లు చేయాలని.. నెలరోజుల్లోగా శామీర్‌పేటను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించి పూర్తి నివేదిక అందించాలని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా శామీర్‌ పేట చెరువుకు నిత్యం నీళ్లు అందుతాయి. శామీర్‌ పేట చెరువు కాలువ ద్వారానే బస్వాపూర్ రిజర్వాయర్‌ కు నీళ్లు వస్తాయి. అటు శామీర్‌పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయి. దీన్ని పర్యాటక శాఖ అద్భుత అవకాశంగా స్వీకరించాలన్నారు. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తారని.. పర్యాటకులు బస చేయడానికి అనువుగా మంచి కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఏర్పాటు చేయాలని చెప్పారు. చెరువు, కాలువల వెంట ఆకర్షణీయమైన పూల మొక్కలు పెంచాలన్న సీఎం.. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్య ఉన్న ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates