పల్లెపల్లెకు సెంటర్ : అంగాన్ వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు

aadhar-anganwadiఆధార్‌ నమోదు మరింత సులభతరం కాబోతుంది.  అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఆధార్‌ సెంటర్లుగా మారబోతున్నాయి. మీ-సేవ కేంద్రాల ద్వారా ఆధార్‌ నమోదు చేస్తున్నప్పటికీ.. గ్రామ స్థాయిలో ప్రజలంతా మండల కేంద్రాలు, సమీప పట్టణాలకు వెళ్లి ఆధార్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వస్తోంది. చంటి పిల్లల ఆధార్‌ నమోదు.. తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంది. ఆధార్‌ నమోదు కోసం రవాణా ఖర్చులు సామాన్యులకు భారంగా మారాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకే ఆధార్‌ నమోదు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖకు ఆధార్‌ రిజిస్ట్రార్‌గా అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టు)లను ఆధార్‌ నమోదు ఏజెన్సీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ ఏజెన్సీల పర్యవేక్షణలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు ఆధార్‌ నమోదు బాధ్యతలు నిర్వహిస్తాయి.

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 25 ప్రాజెక్టులు పట్టణాల్లో, మరో 25 ప్రాజెక్టులు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో 35వేల 700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఐసీడీఎస్‌ పరిధిలోని సీడీపీవో (శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి)కు ఆధార్‌ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడంతో 149 ఆధార్‌ ఏజెన్సీలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.  ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి ఒక కేంద్రం నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates