పశువులను తీసుకెళ్తున్నవారిపై దాడి…ఒకరి మృతి

రాజస్థాన్‌ రాష్ట్రంలోని అల్వార్‌ లో నిన్న(శుక్రవారం- జూలై 20) రాత్రి దారుణం జరిగింది. అల్వార్‌లోని లాల్‌వాండీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు.. రెండు పశువులను తీసుకెళ్తున్నారు. రామ్‌ఘర్ గ్రామానికి రాగానే ఆ ఇద్దరు వ్యక్తులను ఆ గ్రామస్తులు చుట్టుముట్టారు. పశువులను అక్రమ రవాణా చేస్తున్నారని అనుమానించి,  ఆ ఇద్దరిపై దాడి చేశారు…వారిని తీవ్రంగా కొట్టారు. ఆ గ్రామస్తుల దాడిలో ఒకడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు…మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హర్యానాకు చెందిన అక్బర్ ఖాన్(28)గా గుర్తించారు పోలీసులు. ఖాన్ మృతికి కారణమైన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు పోలీసులు. అయితే వీరిద్దరూ పశువులను అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందంటున్నారు పోలీసులు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం వసుంధర రాజే స్పందిస్తూ… నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates