పసిఫిక్‌ మహా సముద్రంలో కుప్పకూలిన అమెరికా విమానాలు  

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన రెండు విమానాలు పసిఫిక్‌ మహా సముద్రంలో కుప్పకూలాయి. ఈ విమానాలు అమెరికా సైన్యానికి సంబంధించినవి. ఈ విమానాల్లో ఉన్న ఆరుగురు మెరైన్లు( నావికాదళ సిబ్బంది) గల్లంతయ్యారు. జపాన్‌కు నైరుతి వైపు సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ఎఫ్-18 యుద్ధవిమానం, సీ-130 రిఫ్యూయెలింగ్‌ విమానం సాధారణ శిక్షణలో ఉండగా… రెండు విమానాలు గగనతలంలో ప్రమాదానికి గురై పసిఫిక్‌ మహా సముద్రంలో పడిపోయాయి. ఆకాశంలో ఉండగా ఇంధనం నింపే ఆపరేషన్‌ చేపడుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు జపాన్‌ రక్షణ మంత్రి.

సముద్రంలో పడిపోయి గల్లంతైన సిబ్బందిలో ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు. గల్లంతైన మిగతా మెరైన్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సీ-130లో ఐదుగురు సిబ్బంది, ఎఫ్‌-18లో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు విమానాలు, మూడు నౌకలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. దక్షిణ జపాన్‌లోని ఇవకునిలో మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ నుంచి రెండు విమానాలు బయలుదేరాయి. ఇవాళ తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఈ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికా సైన్యానికి చెందిన దాదాపు 50వేల మంది సిబ్బంది జపాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా అరుదు. నవంబర్ లో అమెరికా యుద్ధ విమానం జపాన్‌ ద్వీపం ఒకినావా సమీపంలో సముద్రంలో కూలిపోయింది. కానీ అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates