పాక్ నుంచి కుట్ర జరిగిందా : రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ హత్య

deathజమ్ముకాశ్మీర్ లో రైజింగ్ కశ్మీర్ ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారి హత్య కలకలం రేపుతోంది. పక్కా వ్యూహంతో రెక్కీలు నిర్వహించి మరీ ఈ దారుణానికి ఒడిగడ్డారు దుండగులు. రంజాన్ నెల కావటంతో.. సాయంత్రం ఇఫ్తార్ విందుకు బయటకు వస్తారని ముందే ఊహించారు నిందితులు. అందులో భాగంగా.. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీనగర్ లోని తన ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం వచ్చిన వెంటనే.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఆయన కారును అడ్డగించారు. ముందు సీట్లో కూర్చున్న ఎడిటర్ షుజాత్ బుఖారిపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఆయన స్పాట్ లోనే చనిపోయారు.

జర్నలిస్టు హత్య కోసం పాక్ ఉగ్రవాదులు ISI సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు. హత్యకు సంబంధించి శ్రీనగర్ లో CCTV పుటేజ్ ని పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బష్రత్‌ అహ్మద్‌ బుఖారికి ఈయన స్వయానా సోదరుడు. ఢిల్లీలోని కొందరు జర్నలిస్టులు మీరు పక్షపాతంతో రిపోర్టింగ్‌ చేస్తున్నారని గురువారం ఆరోపించగా.. వాటిని ఖండిస్తూ బుఖారి ట్విట్టర్‌ లో బదులిచ్చారు. కశ్మీర్‌లోయలో శాంతి నెలకొనేందుకు గతంలో బుఖారి పలు సమావేశాల్ని నిర్వహించారు.

అంతేకాకుండా కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం భారత్‌–పాక్‌ల మధ్య సాగిన అనధికార ట్రాక్‌–2 చర్చల్లో సైతం ఆయన భాగస్వామిగా ఉన్నారు.  బుఖారి హత్య  క్రమంలో మిలటరీ ఆపరేషన్లను రంజాన్‌ తర్వాత కేంద్రం పునఃప్రారంభించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.  బాధిత  కుటుంబాన్ని పరామర్శించారు CM మెహబూబా ముఫ్తీ. అతడిని చంపడం….మతి లేని చర్య అని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. పిరికిపందలే ఇలాంటి పనులు చేస్తారని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియాలో మీడియాకు స్వేచ్ఛ ఉందని.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్. హత్యను తప్పుపట్టిన రాజకీయనాయకులు… రంజాన్ మాసంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. 2వేల ఏడాదిలోనూ బుఖారీపై హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అతడికి సెక్యూరిటీ కల్పించింది. ఈ దాడిలో బుఖారీ, అతడి సెక్యూరిటీ అధికారి చనిపోయారు. మరో సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు.

Posted in Uncategorized

Latest Updates