పాక్ నుంచి హైదరాబాద్ కు : ఫేక్ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

PAK FAKEఫేక్ డాక్యుమెంట్లతో ఇండియన్ పాస్ పోర్టు తీసుకున్న పాకిస్థానీ ఎండీ ఉస్మాన్ ఇక్రమ్ కు సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మక్సూద్ అహ్మద్ , సయ్యద్ కిర్మాణి, మహ్మద్ ఖాన్ నిజామ్ ఖాజాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పాస్ పోర్టు తీసుకున్న పాకిస్థానీ వ్యక్తి ఎండీ ఉస్మాన్ ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి విచారించారు. అతడు చెప్పిన వివరాలతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ లోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న మక్సూద్ అహ్మద్ ఇచ్చిన సర్టిఫికెట్లతోనే పాస్ పోర్ట్ తీసుకున్నాడని తేల్చారు పోలీసులు. అహ్మద్ ఇంట్లో సోదాలు నిర్వహించగా… దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు చెందిన 2 వేల డిగ్రీ సర్టిఫికెట్లున్నాయని గుర్తించారు. మరిన్ని వివరాలను సేకరించేందుకు నలుగురుని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటామన్నారు పోలీసులు.

మక్సూద్ అహ్మద్ 10, 20 వేలు తీసుకొని ఎవరికైనా టెన్త్, ఇంటర్ , డిగ్రీ సర్టిఫికెట్లను ఇచ్చేవాడని చెబుతున్నారు పోలీసులు. వందకు పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కింది స్థాయి సిబ్బందితో అతనికి పరిచయాలున్నాయని గుర్తించారు. ఆరేళ్లుగా ఈ అక్రమాలు చేస్తున్నాడు అహ్మద్. సర్టిఫికెట్లు అవసరమైన వారిని గుర్తించేందుకు హైదరాబాద్ లో మహ్మద్ ఖాన్ నిజామ్ ఖాజాను ఏజెంట్ గా నియమించుకున్నాడు. మక్సూద్ ఇస్తున్న సర్టిఫికెట్లపై యూనివర్సిటీలకు చెందిన హాలోగ్రామ్ సంతకాలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్ చాదర్ ఘాట్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్న పాకిస్థానీ ఉస్మాన్ ఏడేళ్ల క్రితం ఆ దేశం నుంచి అక్రమంగా హైదరాబాద్ వచ్చాడు. తర్వాత ఇండియా పాస్ పోర్టు కోసం తన భార్య ఫ్రెండ్ సలహాతో మక్సూద్ కు ఏజెంట్ గా పనిచేస్తున్న నిజామ్ ను సంప్రదించాడు. 80 వేలు ఇచ్చి పది, ఇంటర్ , డిగ్రీ సర్టిఫికెట్లను తీసుకున్నాడు. వీటి సాయంతో 2011లో ఓ చిన్న షాపులో ఉద్యోగిగా చేరాడు. 2013 లో బ్యాంకు అకౌంట్ తీసుకొని పాస్ పోర్టుకు అప్లై చేసుకున్నాడు. తర్వాత కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనులు చేస్తూ కళ్యాణ్ ఆర్ట్స్ లో జాబ్ లో చేరాడు. అక్రమంగా పాస్ పోర్టు తీసుకున్నాడన్న అతని భార్య కంప్లైంట్ తో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates