పాక్ మాజీ ప్రధాని పై దాడికి యత్నం

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కొందరు దాడి చేయడానికి ప్రయత్నించారు. లండన్‌లోని అవెన్యూఫీల్డ్ హౌజ్‌లో ఉన్న షరీఫ్ కుమారుడి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. ఆదివారం(జులై-8) ఈ దాడి యత్నం జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి పాక్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు యువకులు షరీఫ్ కుమారుడి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ తలుపును గట్టిగా తన్నడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత షరీఫ్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. షరీఫ్‌ను బూతులు తిట్టారు నవాజ్ కు సాయంగా ఉన్న ఓ భద్రతా అధికారిని కూడా నిరసనకారులు టార్గెట్ చేసుకుని కొట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా.. షరీఫ్ కుటుంబం ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
ఈ ఘటనపై నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ స్పందించారు. ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ (PTI) ఈ దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఆ పార్టీ నేత తమ కార్యకర్తలకు ఎలాంటి శిక్షణ ఇచ్చారో ఈ దాడిని బట్టే అర్థమవుతున్నదని ఆమె విమర్శించారు. అయితే పీటీఐ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన ఏ వ్యక్తి పాల్గొనలేదని స్పష్టంచేసింది.

Posted in Uncategorized

Latest Updates