పాపం పండింది : అమ్మను కొట్టినందుకు..చిప్పకూడు తింటున్నాడు

బెంగళూరు : కన్న కొడుకే కాలయముడయ్యాడు. నవమాసాలు మోసిన తల్లిపై కనికరంలేకుండా ప్రవర్తించాడు. తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలనడమే ఆమె చేసిన పాపం. రోజు గొడ్డును బాదినట్లు తల్లిని చావగొట్టాడు. చివరకు పాపం పండింది. కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.

వివరాల్లోకెళితే..బెంగళూరుకి చెందిన ఓ యువకుడు అల్లరి, చిల్లరిగా జీవించడానికి అలవాటుపడ్డాడు. ఇష్టానుసారం సిగరెట్లు కాల్చడం, మద్యం సేవించడం వంటివాటిలో మునిగిపోయాడు. కన్న తల్లి అనుభవిస్తున్న ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాడు. ఇరుగు పొరుగువారితో తన గురించి చెడుగా చెప్తున్నావంటూ.. తల్లిపైనే దాడికి పాల్పడ్డాడు. దురలవాట్లు మానుకోవాలని ఆ యువకుడికి.. తన తల్లి చెప్పిన ప్రతిసారీ ఆమెను కొట్టేవాడు. ఈ దుర్మార్గాన్ని అతని అక్క వీడియో తీసి, ఆ సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియో చూసిన పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు డిసెంబర్-9న యువకుడిపై కేసు నమోదు చేశారు. అతనిపై ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా..ఆ దుర్మార్గుడికి తగిన శిక్షపడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates