పార్లమెంట్ లో టీఆర్ఎస్ – టీడీపీ ఎంపీల వాగ్వాదం

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ – టీడీపీ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చ ప్రారంభించారు. అయితే ఏపీకి జరిగిన అన్యాయం గురించి కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీడీపీ ఎంపీ ప్రస్తావించటంతో తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగారు. కొత్త రాష్ట్రం ఏపీని.. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అప్రజాస్వామికంగా ఏర్పడిందని.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పార్లమెంట్ లో అడ్డగోలుగా విడగొట్టిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎంపీ గల్లా. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు.. ఏపీ మాత్రమే కొత్త రాష్ట్రమన్నారు.

టీడీపీ ఎంపీ గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారని.. ఇది సొంత ఎజెండాతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నే అవమానిస్తున్నట్లు ఉందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు పోటీగా టీడీపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. కొద్దిసేపు రెండు పార్టీల ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీ వాదన వినిపించండి అని స్పీకర్ సుమిత్ర మహాజన్.. జితేందర్‌రెడ్డికి సూచించారు.

Posted in Uncategorized

Latest Updates