పాలమూరులో ఐటీ పార్కు కోసం.. భారీగా ఏర్పాట్లు

PALAMURUపాలమూరులో ఐటీ పార్క్ కోసం ఏర్పాట్లు జోరుగ సాగుతున్నాయి. 400 ఎకరాల్లో నిర్మించబోయే ఐటీ కారిడార్ కోసం ఇప్పటికే భూ సేకరణ పూర్తయ్యింది. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపనకు ముస్తాబుచేస్తున్నారు పాలమూరు టీఆర్ఎస్ నేతలు. పాలమూరు జిల్లాలో చదువుకున్న యువకులు చాలామంది  ఉపాధి లేక విదేశాలకు వలస వెళుతున్నారు.

స్థానికంగా ఐటీ కంపెనీలు లేకపోవటంతో ఉన్నత విద్య చదివినా ప్రయోజకనం లేకుండాపోయింది.ఇక్కడి వాళ్లు పలు నగరాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. మేధో సంపత్తి ఇతర ప్రాంతాలకు తరలిపోతోందన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఎయిర్ పోర్ట్ , నేషనల్ హైవే 44కు సమీపంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అతి తక్కువ సమయంలోనే భూ సేకరణ జరిపారు. ఇక్కడ హైటెక్ సిటీని పోలిన టవర్ నిర్మాణం చేపడతామంటున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ పట్టణానికి ఆనుకుని ఐటీ కారిడార్ ఏర్పాటు కావటంతో జిల్లా కేంద్రం మరింత అభివృద్ది చెందే అవకాశం ఉంది.

మహబూబ్ నగర్, దివిటిపల్లి, ఎదిర, సిద్దాయిపల్లి మధ్యలో ఐటీ కారిడార్ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే ఇక్కడ వందలాది డబుల్ బెడ్ రూం ఇళ్లు… ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటవుతోంది.  బైపాస్ రోడ్డు నిర్మాణం జరగనుంది. పాలమూరు ఐటీ కారిడార్ చిరస్థాయిలో నిలుస్తుందని చెబుతున్నారు  స్థానిక నేతలు. ఐటీ పార్క్ కు త్వరలోనే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పాలమూరులో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో 10 కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఐటీ కారిడార్ తోపాటు మల్టీపర్సస్ ఇండస్ట్రీయల్ కారిడర్ తో జిల్లాకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates