పాలమూరు ప్రాజెక్టు సొరంగంలో పేలుడు:  ఇద్దరు మృతి

Blast-In-Palamuru-Tunnelపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి  చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల దగ్గర బుధవారం (మే-23) నార్లపూర్‌ భూగర్భ పంప్‌హౌజ్‌లోకి పోయే టన్నెల్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 18 మంది ఉండగా.. అందరికీ గాయాలయ్యాయి. వీరిని చికిత్సకోసం నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పాల్‌చంద్‌ (32), జయంత్‌(35) మృతి చెందారు.  మిగతా వారిని హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు.

ఈ ప్రమాదం ప్రకృతి వైపరీత్యంగానే జరిగిందని సీఈ లింగరాజు తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల కారణంగా డైనమైట్లను పేల్చే వైర్లకు కరెంట్‌ సరఫరా జరిగి పేలుళ్లు సంభవించినట్లుగా తెలిపారు.మృతదేహాలకు నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం పూర్తికాగానే మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రాజెక్టు సొరంగం దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయిన కూలీల కుటుంబాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా పాలెం హాస్పిటల్ లో మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. మృతిచెందిన ఒక్కో కూలీ కుటుంబానికి రూ. 14 లక్షలు పరిహారంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా గాయపడ్డ కూలీలకు వైద్య చికిత్సలు పూర్తి ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు.

Posted in Uncategorized

Latest Updates