పిట్టల్లా రాలాయి : కెమికల్ విషవాయువుకు 31 కోతులు బలి

రాయ్‌ గఢ్ : విష వాయువు కారణంగా 31 కోతులు మరణించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. రాయ్ గఢ్ జిల్లా, పన్వెల్ మండలం పోశ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన.. డిసెంబర్ 16న వెలుగులోకి వచ్చింది. ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ కావడంతో 31 కోతులు, 14 పావురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే వాటి మృతదేహాలను పాతిపెట్టారు అక్కడి సిబ్బంది.

పన్వేల్ మండలానికి పది కిలోమీటర్ల దూరంలోనే కర్నాల పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. హిందూస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్(HOCL) అధీనంలో ఉన్న పోశ్రీ ప్రాంతాన్ని ఇటీవలే ఇస్రోకు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)కు బదలాయించారు. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాయి ఈ మూడు సంస్థలు. అటవీ అధికారుల సమాచారంతో మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారు. కోతులు, పావురాల మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు అటవీ సంరక్షణాధికారులు.

వాటికి పోస్ట్ మార్టం తర్వాత, మరిన్ని పరీక్షల కోసం హాఫ్‌ కిన్స్ ఇన్‌ స్టిట్యూట్‌ కు తరలించినట్లు చెప్పారు అటవీ అధికారులు. ఈ ఘటన దురదృష్టకరమని, దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు రాయ్‌ గఢ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ.

Posted in Uncategorized

Latest Updates